- Home
- Sports
- Cricket
- ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాస్తవ... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అనామక ప్లేయర్లుగా...
ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాస్తవ... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అనామక ప్లేయర్లుగా...
130 కోట్ల మంది భారతీయుల్లో టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నా క్రికెట్ టీమ్‌లో ఆడేది 11 మందే. సరైన అవకాశాలు రాక, వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేక అనామకులుగా క్రికెట్ నుంచి తప్పుకున్న టాలెంటెడ్ ప్లేయర్లు గల్లీకొకరు దొరుకుతారు వెతికితే! లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియా మహారాజాస్ తరుపున అదరగొట్టిన ప్లేయర్లు పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాస్తవ కూడా అలాంటివాళ్లే. వీళ్ల గురించి పెద్దగా ఎవ్వరీకీ తెలీదు...

Image credit: PTI
ఇండియా మహారాజాస్ టీమ్‌కి హర్భజన్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్, శ్రీశాంత్ వంటి ప్లేయర్లు ఆడారు. వీరితో పాటు అశోక్ దిండా, టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఫైనల్‌లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ కూడా మహారాజాస్ టీమ్ తరుపున బరిలో దిగారు...
అయితే వీళ్లంతా వికెట్లు తీయడానికి కష్టపడుతూ ఉంటే పంకజ్ సింగ్ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన పంకజ్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు..
అది కూడా మామూలు ప్లేయర్లను కాదు, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ, శ్రీలంక మాజీ క్రికెటర్ రొమేశ్ కలువితరణ, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ టిమ్ బ్రేస్నన్‌లను పెవిలియన్ చేర్చాడు పంకజ్ సింగ్...
అసలు ఎవరీ పంకజ్ సింగ్? ఉత్తరప్రదేశ్‌కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు...
తన రెండో టెస్టులో జో రూట్, జోస్ బట్లర్‌లను అవుట్ చేశాడు పంకజ్ సింగ్. మొదటి మ్యాచ్‌లో పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలెస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంకజ్, ఆరంగ్రేట మ్యాచ్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 179 పరుగులు సమర్పించాడు పంకజ్ సింగ్.
అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంకజ్ సింగ్‌కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్‌లో 115 వికెట్లు తీశాడు... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పంకజ్ సింగ్‌ని కొనుగోలు చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు.
పంకజ్ సింగ్‌తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన తన్మయ్.. 34 టీ20 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు...
Tanmay Srivastava
అయితే ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్‌లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు..