IPL2021 Final: బిగ్ ఫైట్ కు అందుబాటులో లేని షారుఖ్ ఖాన్.. కేకేఆర్ అభిమానుల్లో కనిపిస్తున్న వెలితి
Sharukh Khan: బాలీవుడ్ అగ్రనటుడు, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్స్ కు హాజరుకావడం లేదు. గతంలో లీగ్ మ్యాచ్ లు జరిగినా వచ్చి అభిమానులను ఉత్సాహపరిచిన షారుఖ్.. నేటి సీజన్ లో మాత్రం అటు వైపు కూడా చూడలేదు.
బాలీవుడ్ (Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) యజమానిగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఐపీఎల్ ఫైనల్స్ కు చేరింది. భారత్ లో జరిగిన ఐపీఎల్ తొలి అంచెలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో ఓడిపోయిన ఆ జట్టు.. రెండో అంచెలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది.
రన్ రేట్ కూడా కలిసిరావడంతో ఆ జట్లు ప్లేఆఫ్స్ (IPL) కూడా చేరింది. ప్లే ఆఫ్స్ లో ఆ జట్టు రెండు అద్భుత మ్యాచ్ లతో ఐపీఎల్ ఫైనల్స్ (IPL Finals) కు చేరుకుంది.
అయితే అనూహ్యంగా ఫైనల్స్ కు చేరిన కోల్కతా నైట్ రైడర్స్ కు జట్టు ఆటగాళ్లకు పెద్దదిక్కులా ఉన్న ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ మాత్రం ఈసారి ఫైనల్స్ కు హాజరు కావడం లేదు.
గతంలో లీగ్ మ్యాచ్ లు జరిగినా స్టేడియంలో వాలిపోయి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఖాన్.. ఈసారి మాత్రం పర్సనల్ ప్రాబ్లమ్స్ తో టోర్నీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
ఇటీవలే తన కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసు (Drugs Case)లో అరెస్టవడం.. ఇప్పటికీ అతడికి బెయిల్ దొరక్క జైళ్లోనే ఉండటంతో షారుఖ్ కుటుంబం దిగాలుగా ఉంది. ఈ సమయంలో అతడు దుబాయ్ లో జరిగే ఫైనల్స్ కు హాజరవడం లేదని కేకేఆర్ (KKR) వర్గాలు తెలిపాయి.
అయితే తాను అందుబాటులో లేకున్నా జట్టు సీనియర్ ప్రతినిధులతో షారుఖ్ టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తున్నది. కేకేఆర్ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకీ మైసూర్ తో పాటు మరో ఇద్దరితో షారుఖ్ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం.
ఐపీఎల్ తొలి అంచె తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తో పాటు జట్టు ప్రదర్శనపై షారుఖ్ నిరాశచెందాడు. దీంతో దుబాయ్ లో కూడా కేకేఆర్ గొప్ప ప్రదర్శన చేస్తుందని షారుఖ్ ఊహించలేదు. దీంతోనే అతడు కోల్కతా కు సంబంధించిన మ్యాచ్ లు, విజయాలకు సంబంధించిన విషయాలను కూడా ట్విట్టర్ లో పోస్టు చేయడం లేదు.
ఆర్యన్ ఖాన్ ఉదంతం షారుఖ్ తో పాటు అతడి భార్య గౌరీ ఖాన్ ను కూడా దారుణంగా కుంగదీసింది. దీంతో షారుఖ్ ఇంటికే పరిమితమయ్యాడు. షూటింగులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా అందుకు కోర్టు వెసులుబాటు ఇవ్వడంలేదు.
ఈ నేపథ్యంలో అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు ఆటగాళ్లు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ట్రోఫీని షారుఖ్ కు డెడికేట్ చేయాలని భావిస్తున్నారు. మరి నేటి ఫైనల్ (CSK vs KKR)లో ఏం జరుగుతుందో చూడాలంటే మరికొద్దిగంటలు వేచి చూడాల్సిందే.