- Home
- Sports
- Cricket
- ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా కోల్కతా హెడ్ కోచ్..? నియమిస్తే తొలి బాధ్యతలు సొంత జట్టుకు వ్యతిరేకంగానే..!
ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా కోల్కతా హెడ్ కోచ్..? నియమిస్తే తొలి బాధ్యతలు సొంత జట్టుకు వ్యతిరేకంగానే..!
Brendon McCullum: ఇటీవల వరుస ఓటములతో అంతర్జాతీయ క్రికెట్ ముందు తీవ్ర విమర్శల పాలవుతున్న ఇంగ్లాండ్ గత వైభవాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నది. ఇన్నాళ్లు కెప్టెన్ గా ఉన్న రూట్ ను కాదని కొత్త సారథి బెన్ స్టోక్స్ ను నియమించింది.

ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లాండ్ జట్టుకు కూడా కోచ్ గా మారనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
ఇంగ్లాండ్ రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులకు) కు హెడ్ కోచ్ గా మెక్ కల్లమ్ పేరు దాదాపు ఖరారైందని సమాచారం. ఈ మేరకు మెక్ కల్లమ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం.
క్రిక్ బజ్ నివేదిక ప్రకారం... ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండేందుకు మెక్ కల్లమ్ తన సమ్మతిని తెలియజేశాడని, అతడి పనితనంపై ఈసీబీ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్దిరోజులుగా మెక్ కల్లమ్ తో సంప్రతింపులు జరుపుతున్నాడు.
గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి ఇంగ్లాండ్.. వరుస పరాజయాలతో తీవ్ర అప్రతిష్ట పాలవుతున్నది. భారత్ తో సిరీస్ తర్వాత.. స్వదేశంలో న్యూజిలాండ్ తో ఓడటం.. యాషెస్ లో ఆసీస్ చేతిలో 4-0 దారుణ అవమానకర ఓటమి.. ఇటీవల ముగిసిన విండీస్ సిరీస్ లో 2-1 తో ఓడటంతో ఇంగ్లాడ్ టెస్టు జట్టు, బోర్డుపై సీనియర్ క్రికెటర్లు ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే పాత సారథి జో రూట్ ను మార్చిన ఈసీబీ.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. జూన్ లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. మూడు టెస్టుల నిమిత్తం కివీస్.. ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లాండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు.
ఒకవేళ మెక్ కల్లమ్ గనక ఇంగ్లాండ్ హెడ్ కోచ్ అయితే అతడు తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వేర్వేరు సారథులు ఉన్నట్టే వేర్వేరు హెడ్ కోచ్ లుకూడా ఉంటారు. అయితే టెస్ట్ హెడ్ కోచ్ పదవికి ఆసక్తిగా ఉన్న మెక్ కల్లమ్.. పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్ గా ఉండటానికి అనాసక్తి చూపుతున్నాడు.
అయితే టెస్టులకు మెక్ కల్లమ్ ను హెడ్ కోచ్ గా నియమిస్తున్న ఈసీబీ.. వన్డేలు, టీ20లకు మాత్రం దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ కు అప్పగించే అవాకశముంది. ప్రస్తుతం కిర్స్టెన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు మెంటార్ గా ఉన్నాడు.