సచిన్ రికార్డులను రూట్ బద్దలు కొట్టడం ఖాయం.. ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్స్
Joe Root: విఖ్యాత లార్డ్స్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో సెంచరీ చేసిన జో రూట్.. తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డులను కూడా అధిగమిస్తాడని అంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్.

న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో ముగిసిన తొలి టెస్టు లో సెంచరీ చేసిన జో రూట్.. ఈ క్రమంలో పది వేల పరుగుల క్లబ్ లో కూడా చేరాడు. 115 పరుగులతో అజేయంగా నిలిచిన రూట్ పలు రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
అయితే రూట్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అతడు.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద విషయమేమీ కాదంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్.
టెస్టులలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు (15,921) సచిన్ పేరిట ఉంది. ఆ రికార్డును రూట్ బద్దలుకొడతాడని టేలర్ జోస్యం చెప్పాడు. టేలర్ మాట్లాడుతూ.. ‘రూట్ వయసు ఇప్పుడు 31 ఏండ్లు. ఎంత లేదు అన్నా అతడు మరో 5 ఏండ్లు క్రికెట్ ఆడటం పక్కా. కావున అతడు సచిన్ రికార్డును బద్దలుకొడతాడు.
గత రెండేండ్లుగా అతడి బ్యాటింగ్ పీక్స్ లో ఉంది. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే గనక రూట్.. గత కొన్నాళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న సచిన్ 15వేల పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు.
అయితే అందుకు అతడు ఫిట్ గా ఉండాలి. పామ్ కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది..’అని టేలర్ చెప్పుకొచ్చాడు. ఆదివారం పదివేల పరుగుల క్లబ్ లో చేరిన రూట్.. ఇంగ్లాండ్ తరఫున 10వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్ అయ్యాడు. ఈ జాబితాలో అలెస్టర్ కుక్ (12,472) అగ్రస్థానంలో నిలిచాడు.
తన కెరీర్ లో 118 వ టెస్టు ఆడుతున్న రూట్ కు ఇది 26వ టెస్టు సెంచరీ. ఫ్యాబ్ 4 ఆటగాళ్లుగా పిలిచే విరాట్ కోహ్లి (27), స్టీవ్ స్మిత్ (26), జో రూట్ (26), కేన్ విలియమ్సన్ (24)లలో గత కొంతకాలంగా మిగిలినవారికంటే రూట్ మెరుగ్గా ఆడుతున్నాడు.
లార్డ్స్ టెస్టు లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ (115 నాటౌట్), బెన్ స్టోక్స్ (54), బెన్ ఫోక్స్ (32 నాటౌట్) లు రాణించారు.