- Home
- Sports
- Cricket
- ఒకే ఏడాది రెండు ఐపీఎల్ సీజన్ల పై పెరుగుతున్న మద్దతు.. దానిని ఎవరూ ఆపలేరంటున్న టీమిండియా మాజీ క్రికెటర్
ఒకే ఏడాది రెండు ఐపీఎల్ సీజన్ల పై పెరుగుతున్న మద్దతు.. దానిని ఎవరూ ఆపలేరంటున్న టీమిండియా మాజీ క్రికెటర్
Two IPLs Per Year: టీ20 క్రికెట్ విస్తృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు తగ్గించి ఫ్రాంచైజీ క్రికెట్ ను పెంచాలని రవిశాస్త్రి చేసిన ప్రతిపాదనకు మద్దతు పెరుగుతున్నది.

టీ20 క్రికెట్ లో ద్వైపాక్షిక సిరీస్ లను నిలిపేసి ఫ్రాంచైజీ క్రికెట్ వంటి ఐపీఎల్ ను ఇంకా పెంచాలని కోరుతూ ఇటీవలే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.
శాస్త్రి వ్యాఖ్యలకు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అలా జరగడం ఖాయమని.. భవిష్యత్ లో రెండు ఐపీఎల్ సీజన్లను చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
చోప్రా మాట్లాడుతూ.. ‘ఒక ఏడాదిలో రెండు ఐపీఎల్ లు అవసరమనిపిస్తే తప్పకుండా ఆడించాలి. నా అభిప్రాయం ప్రకారమైతే రాబోయే కాలంలో ఏడాదికి రెండు ఐపీఎల్ సీజన్లను కచ్చితంగా చూస్తాం.
అయితే ఒకటి బిగ్ ఐపీఎల్ (94 మ్యాచులు) ఒకటి స్మాల్ ఐపీఎల్ (46 మ్యాచులు) లా ఉంటే బాగుంటుంది. రెండో సీజన్ లో ప్రతి జట్టు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడినా చాలు..
ఇది ఎప్పుడు జరుగుతుంది..? ఎలా నిర్వహిస్తారు..? అన్నదే ఇక్కడ ప్రశ్న. మీరొక్కసారి విత్తనాలు నాటి వాటి సంరక్షణ చూసుకుంటే చాలు అదే భారీ వృక్షమై మిమ్మల్ని రక్షిస్తుంది. తర్వాత అదే దాని మనుగడను కాపాడుకుంటుంది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఏముంది..? ఆ లీగ్ ఇక్కడిదాకా వస్తుందని ఎవరైనా ఊహించారా..? కానీ ఇప్పుడు చూడండి ఐపీఎల్ ఎక్కడుందో.. రెండు సీజన్ల ఐపీఎల్ కూడా అంతే. అది సహజ పరిణామం..’ అని తెలిపాడు.
కాగా వన్డే క్రికెట్ గురించి కూడా చోప్రా కామెంట్స్ చేశాడు. అభిమానుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే.. టెస్టుల కంటే వన్డేలు బాగా బోరింగ్ ఫార్మాట్ అనిపిస్తున్నది. అదో అర్థం పర్థం లేని ఫార్మాట్. దాని గురించి ఎవరూ పట్టించుకోరు. ఆ ఫార్మాట్ ఇబ్బందుల్లో ఉంది..’ అని వ్యాఖ్యానించాడు.