- Home
- Sports
- Cricket
- అలా చేసినందుకు రెండ్రోజులు నిద్రపోలేదు.. నన్నలా చూసి నా భార్య.. : పాక్ క్రికెటర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు
అలా చేసినందుకు రెండ్రోజులు నిద్రపోలేదు.. నన్నలా చూసి నా భార్య.. : పాక్ క్రికెటర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు
Hasan Ali: గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెమీస్ కు చేరిన పాకిస్థాన్.. సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచులో హసన్ అలీ జారవిడిచిన క్యాచుకు సంబంధించిన విజువల్స్ పాకిస్థాన్ అభిమానుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ లో లీగ్ దశలో అప్రతీహాత విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో హోరాహోరిగా సాగిన పోరులో పోరాడి ఓడింది.
ఈ మ్యాచులో ఆసీస్ తరఫున భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ లు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును ఫైనల్ కు చేర్చారు. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమనగా.. షాహీన్ అఫ్రిది వేసిన 48వ ఓవర్లో మాథ్యూ వేడ్ నాలుగు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు.
అయితే వీళ్ల వీరబాదుడుతో పాటు ఈ మ్యాచులో హసన్ అలీ జారవిడిచిన క్యాచుకు సంబంధించిన విజువల్స్ పాకిస్థాన్ అభిమానుల్లో ఇప్పటికీ మెదలుతూనే ఉన్నాయి. అప్పట్లో అలీ తో పాటు భారతీయురాలైన ఆయన భార్యపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
తాజాగా ఇదే విషయమై ఆ క్యాచ్ మిస్ చేసిన ఫీల్డర్ హసన్ అలీ నోరు విప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాతో పాటు పాక్ లో తీవ్ర విమర్శలను ఎదుర్కున్న అతడు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హసన్ మాట్లాడుతూ... ‘నా కెరీర్ లో అది అత్యంత కఠిన సమయం. ఆ మ్యాచ్ ఫలితాన్ని నేను అస్సలు మరిచిపోలేకపోయాను. ఇప్పటివరకూ ఆ విషయం గురించి బయట ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఇప్పుడు దానిని బయటపెడుతున్నాను.
పాకిస్థాన్ సెమీస్ లో ఓడిన తర్వాత రెండ్రోజుల పాటు నిద్ర పోలేదు. రాత్రుళ్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిని. అది చూసి నా భార్య కంగారుపడింది. నన్ను అలా చూసి తాను తీవ్ర ఆందోళనకు గురైంది. నేను ఏమైపోతానో అని భయపడింది.
కానీ నేను మాత్రం జారవిడిచిన క్యాచ్ గురించే ఆలోచించేవాడిని. ఏం చేద్దామన్నా ఆ విషయమే గుర్తుకు వచ్చేది...’ అని అలీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ క్యాచ్ తర్వాత అయోమయ స్థితిలోకి వెళ్లిన తనకు పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఎంతో అండగా నిలిచాడని హసన్ అన్నాడు.
‘మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లగానే నేను బోరున ఏడ్చాను. నాతో పాటు షాహీన్ అఫ్రిది కూడా ఏడుస్తున్నాడు. జట్టు సహచరులంతా మమ్మల్ని ఓదార్చారు. ఆ క్రమంలో షోయబ్ బాయ్ నా దగ్గరకు వచ్చి ఓదార్చాడు. నువ్వు టైగర్ వు.. ఇలా ఏడవొద్దు.. అని నాకు నచ్చజెప్పాడు..’ అని అన్నాడు.
షోయబ్ తో పాటు సహచర పాక్ ఆటగాళ్లు, సోషల్ మీడియాలో అభిమానులు తనకు అండగా నిలిచారని అలీ చెప్పాడు. ఆ మ్యాచ్ ముగిశాక నాలుగైదు రోజులకు తనకు తానే సర్ధి చెప్పుకున్నానని, ఆ చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నిశ్చయించుకున్నానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముగిశాక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన హసన్ అలీ.. టెస్టులతో పాటు టీ20లలో కూడా మెరుగ్గా రాణించాడు.