- Home
- Sports
- Cricket
- IPL: అతడిని కోల్పోవడం బాధాకరమే.. కానీ మాకు..! గిల్ ను రిటైన్ చేసుకోకపోవడంపై కేకేఆర్ హెడ్ కోచ్
IPL: అతడిని కోల్పోవడం బాధాకరమే.. కానీ మాకు..! గిల్ ను రిటైన్ చేసుకోకపోవడంపై కేకేఆర్ హెడ్ కోచ్
IPL Auction 2022: ఐపీఎల్ లో 2018లో అడుగుపెట్టిన గిల్.. ఇప్పటివరకు 58 మ్యాచులాడాడు. భావి కెప్టెన్ అనుకున్న అతడిని కేకేఆర్ వదిలేసుకుంది. దీంతో ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ జట్టు.. భారీ ధర వెచ్చించి దక్కించుకుంది.

ఐపీఎల్ లో గతంలో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున పలు కీలక మ్యాచులు ఆడిన టీమిండియా ఆటగాడు శుభమన్ గిల్ ను ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడిని ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ జట్టు.. భారీ ధర వెచ్చించి దక్కించుకుంది.
కోల్కతా తరఫున 58 మ్యాచులు ఆడిన గిల్.. గత సీజన్ లో కేకేఆర్ తరఫున 17 మ్యాచులు ఆడి 478 పరుగులు చేశాడు. కేకేఆర్ కు భావి కెప్టెన్ గా భావించినా.. ఆ జట్టు మాత్రం అతడిని రిటైన్ చేసుకోలేదు.
గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియలో ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు) సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు) ను రిటైన్ చేసుకుంది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలంలో ఎవరికి దక్కించుకోవాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నది.
ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్.. రిటెన్షన్ ప్రక్రియ, వేలం, శుభమన్ గిల్, తదితర అంశాలపై స్పందించాడు.
మెక్కల్లమ్ మాట్లాడుతూ.. ‘సునీల్ రనైన్, ఆండ్రీ రసెల్ దశాబ్దకాలంగా కేకేఆర్ కు సేవలందిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి సామర్థ్యమేమిటో గత రెండు ఐపీఎల్ సీజన్లలో చూశాం. దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో వెంకటేశ్ అయ్యర్ సృష్టించిన ప్రభంజనాన్ని మనం చూశాం.. ఈ నలుగురికి నలుగురు సాటి.
తనదైన రోజున రసెల్ ఎలాంటి అద్భుతాలు చేయగలడో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను వదిలేయాల్పి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా శుభమన్ గిల్ ను కోల్పోవడం నిరాశ కలిగించింది.
మీరు చాలా మంది ఆటగాళ్లను కోల్పోతున్నందున మీరు ప్లాన్ (వేలాన్ని ఉద్దేశిస్తూ.. ) చేసుకోవాలి. ఎంతో ప్రతిభ కలిగిన యువ ఆటగాడు శుభమన్ గిల్ ను కోల్పోవడం నిరాశపరిచింది. కానీ జీవితంలో కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఇక తదుపరి ఐపీఎల్ వేలం కోసం మేము సిద్ధమవుతున్నాము..’ అని అన్నాడు.
ఐపీఎల్ లో 2018లో అడుగుపెట్టిన గిల్.. ఇప్పటివరకు 58 మ్యాచులాడాడు. మొత్తంగా 1,417 పరుగులు చేశాడు. ఇందులో పది అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 76.
నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ కు ఆడిన అతడు.. వచ్చే సీజన్ నుంచి అహ్మదాబాద్ కు ఆడనున్నాడు. ఇందుకు గాను అహ్మదాబాద్ అతడిని ఏకంగా రూ. 8 కోట్లు పెట్టి దక్కించుకుంది.