ఇప్పుడు మూడు ఫార్మాట్‌లు ఆడే ఆటగాళ్లకు కష్టమే.. డికాక్ షాకింగ్ కామెంట్స్
Quinton de Kock: ఫార్మాట్ తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ సారథి క్వింటన్ డికాక్.

వన్డే క్రికెట్ నుంచి తప్పుకుని టెస్టులు, టీ20లనే ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిర్ణయంపై జోరుగా చర్చ జరుగుతున్నది. వన్డే క్రికెట్ చచ్చిపోతుందని కొందరు.. దానిని బ్యాన్ చేయాలని మరికొందరు కోరుతుంటే.. ఇంకొంతమంది ఐసీసీ, దేశాల క్రికెట్ బోర్డులు తీరిక లేని షెడ్యూల్స్ పెట్టి ఆటగాళ్లను మానసికంగా, భౌతికంగా హింసిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Quinton de Kock
ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయమై దక్షిణాఫ్రికా మాజీ సారథి, ప్రస్తుతం ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలందిస్తున్న క్వింటన్ డికాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితులలో మూడు ఫార్మాట్ ఆడే ఆటగాళ్లకు తిప్పలు తప్పవని అన్నాడు.
ఇంగ్లాండ్ తో మూడో వన్డే వర్షం కారణంగా ముగిసిన తర్వాత డికాక్ మాట్లాడుతూ.. ‘మూడు ఫార్మాట్లలో ఆడటమనేది చాలా కష్టం. మరీ ముఖ్యంగా బిజీ షెడ్యూల్స్ లో టెస్టు, వన్డే, టీ20లలో ఫార్మాట్ కు తగ్గట్టు రాణించడమనేది శక్తికి మించిన పని. ఇలా ఆడేవారికి తిప్పలు తప్పవు. సంవత్సరం పొడవునా వీళ్లంతా మ్యాచులు ఆడుతూనే ఉండాలి..
అయితే ఈ విషయంలో ఏ ఫార్మాట్ ఆడాలనేదానిమీద ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ ఫార్మాట్ ఆడాలి..? దేనికి విశ్రాంనివ్వాలి..? అనేదానిమీద స్వేచ్చగా నిర్ణయం తీసుకోవాలి.
అలాకాకుండా మూడు ఫార్మాట్లు ఆడగలరనుకుంటే వారి పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుత పరిస్తితుల్లో మూడు ఫార్మాట్ లలో ఆడటమనేది మామూలు విషయం కాదు..’ అని తెలిపాడు.
మిగతావాళ్ల విషయం పక్కనబెడితే తాను తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నానని డికాక్ చెప్పాడు. తాను టెస్టుల నుంచి తప్పుకున్నా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఈ ఏడాది భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన క్రమంలో డికాక్.. టెస్టులకు గుడ్ బై చెప్పి వన్డేలు, టీ20లలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.