- Home
- Sports
- Cricket
- అసలది ఇష్యూయే కాదు.. కానీ కొన్ని ఛానెళ్లు టీఆర్పీ కోసం.. : గంగూలీ-కోహ్లి విబేధాలపై టీమిండియా మాజీ క్రికెటర్..
అసలది ఇష్యూయే కాదు.. కానీ కొన్ని ఛానెళ్లు టీఆర్పీ కోసం.. : గంగూలీ-కోహ్లి విబేధాలపై టీమిండియా మాజీ క్రికెటర్..
Gambhir On kohli-Ganguly Row: కొంతకాలంగా భారత క్రికెట్ ను పట్టి పీడిస్తున్న కోహ్లి-గంగూలీ వివాదంపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో కొన్ని ఛానెళ్లు అతికి పోయాయని...

ఇటీవల కాలంలో భారత క్రికెట్ ను కుదిపేసి(స్తు)న సమస్య ఏదైనా ఉందా..? అంటే అది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ గంగూలీ, మాజీ సారథి విరాట్ కోహ్లి ల మధ్య తలెత్తిన విబేధాలు అని క్రికెట్ గురించి తెలిసిన వారిని ఎవర్ని అడిగినా చెబుతారు.
కోహ్లి టీ20 కెప్టెన్ గా వైదొలగాలనుకోవడం.. అది భారత క్రికెట్ కు మంచిది కాదని, విరాట్ ను ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని తాను సూచించానని గంగూలీ బహిరంగంగానే వ్యాఖ్యానించడం.. అయితే దాదాతో పాటు బీసీసీఐ లోని ఏ ఒక్కరు కూడా కెప్టెన్సీ వైదొలిగే విషయంలో తనను సంప్రదించలేనని కోహ్లి చెప్పడంతో వివాదం రాజుకుంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ ను వన్డే కెప్టెన్ గా చేయడంతో కోహ్లి-గంగూలీ మధ్య దూరం మరింత పెరిగింది. ఇక దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ ముగిశాక కోహ్లి.. ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని గుసగుసలు వినిపించాయి. అయితే దీనిమీద ఈ ఇద్దరూ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.
భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి వాళ్లతో పాటు తాజా మాజీ లు కూడా ఈ వివాదంపై కామెంట్స్ చేశారు. ఇది ఇద్దరు కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించారు.
తాజాగా ఇదే విషయమై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. గంభీర్ స్పందిస్తూ.. ఇది కొన్ని ఛానెళ్లకు టీఆర్పీ పెంచిందని, ఆ ఇద్దరి మధ్య నిజంగా విబేధాలుంటే వాళ్లిద్దరే చర్చించుకుని సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచించాడు.
గంభీర్ మాట్లాడుతూ... ‘ఈ సమస్య (కోహ్లి-గంగూలీ వివాదం) అంతర్గత పోరాటం. లోతుల్లోకి వెళ్తే ఈ విషయం తేలికగా పరిష్కారమవుతుంది. ఇదేమంత పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని ఛానెళ్లు టీఆర్సీల కోసం దీనిని వాడుకున్నాయి. ఈ విషయంలో వాళ్లిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది..’ అని అన్నాడు.
ఇక కోహ్లి టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంపై మాట్లాడుతూ.. ‘విరాట్ రెడ్ బాల్ కెప్టెన్ గా కొనసాగి ఉంటే బావుండేదని నేను భావిస్తున్నాను. టీ20 కెప్టెన్సీ వదులకున్న తర్వాత అతడు వన్డేలలో కూడా నాయకత్వ పగ్గాలు కోల్పోవల్సి వచ్చింది. పరిమిత ఓవర్లు, బీసీసీఐ కోణం నుంచి చూస్తే అది సరైందే. అయితే టెస్టు కెప్టెన్సీ కోల్పోవడమనేది విరాట్ వ్యక్తిగత నిర్ణయం...’ అని తెలిపాడు.