ఇషాంత్ శర్మ నూరో టెస్టు... రెండో ఓవర్‌లోనే వికెట్ తీసిన లంబూ... తొలి బంతికే అక్షర్ పటేల్...
కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో వేసిన రెండో ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో డొమినిక్ సిబ్లీ, రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఏడో ఓవర్‌లో బంతి అందుకున్న అక్షర్ పటేల్, తొలి బంతికే బెయిర్‌స్టోను అవుట్ చేయడంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.
కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జ్ఞాపికను అందచేయగా, కేంద్ర మంత్రి అమిత్ షా, నూరో టెస్టు క్యాపును బహుకరించాడు...
ఓవరాల్‌గా 100 టెస్టులు పూర్తి చేసుకున్న 70వ ప్లేయర్ ఇషాంత్ శర్మ... అయితే 100 టెస్టులు ఆడిన వారిలో రెండో పొడవైన ప్లేయర్ ఇషాంత్. ఇంతకుముందు స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే ఇషాంత్ శర్మ కంటే అత్యధిక ఎత్తు ఉండి, వంద టెస్టులు ఆడిన ప్లేయర్లుగా నిలిచాడు.
టీమిండియా తరుపున 10 మంది ప్లేయర్లు 100 అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడగా, బౌలర్లలో కేవలం నలుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
అనిల్ కుంబ్లే 132 టెస్టులు ఆడగా, కపిల్ దేవ్ 131 మ్యాచులు ఆడారు. హర్భజన్ సింగ్ 103 టెస్టులు ఆడగా, ఇషాంత్ 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు...
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌గా నిలిచాడు ఇషాంత్ శర్మ. కపిల్ దేవ్ స్వదేశంలో 219 వికెట్లు తీయగా, జవగళ్ శ్రీనాథ్ 108 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ 104 వికెట్లతో టాప్ 3లో ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ 200, రాహుల్ ద్రావిడ్ 163, లక్ష్మణ్ 134, అనిల్ కుంబ్లే 132, కపిల్‌దేవ్ 131, సునీల్ గవాస్కర్ 125, వెంగ్‌సర్కార్ 116, సౌరవ్ గంగూలీ 113, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో 103 టెస్టులతో ఇషాంత్ శర్మ కంటే ముందున్నారు.
ఇంగ్లాండ్ తరుపున అత్యధికంగా 15 మంది ప్లేయర్లు 100 టెస్టులు, అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడగా ఆస్ట్రేలియా నుంచి 13 మంది ఈ మైలురాయిని అధిగమించారు. మూడో స్థానంలో ఉన్న భారత జట్టు నుంచి 11 మంది, వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడారు.