- Home
- Sports
- Cricket
- ‘కెప్టెన్లను మారిస్తే కప్పులు రావు.. ఆ నాలుగూ పాటించండి.. ఫలితాలు మరో విధంగా ఉంటాయి..’
‘కెప్టెన్లను మారిస్తే కప్పులు రావు.. ఆ నాలుగూ పాటించండి.. ఫలితాలు మరో విధంగా ఉంటాయి..’
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో మరోసారి టీమిండియా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టు ఇకనైనా అతి జాగ్రత్తకు పోకుండా భయంలేని క్రికెట్ ఆడాలని సూచనలూ వెల్లువెత్తుతున్నాయి.

ఐసీసీ టోర్నీలో భారత్ మరోసారి అవమానకర రీతిలో నిష్క్రమించడం ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లకూ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, భువనేశ్వర్ వంటి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని, టీ20 ఫార్మాట్ కు కొత్త క్రికెట్ టీమ్, కెప్టెన్, కోచ్ లను మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా ఆటతీరు మారడానికి పలు సూచనలు చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు. భారత క్రికెట్ రూపురేఖలు మార్చేందుకు పఠాన్ నాలుగు పాయింట్ల ఫార్ములాతో ముందుకొచ్చాడు.
ట్విటర్ వేదికగా స్పందించిన పఠాన్.. ‘ఇండియా క్రికెట్ ముందుకెళ్లాలంటే.. 1) ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడగలగాలి. అందులో కనీసం ఒక్కరైనా ఫ్రీగా బ్యాటింగ్ చేయాలి. 2) మణికట్టు స్పిన్నర్ జట్టులో తప్పకుండా ఉండాలి. అతడు తప్పకుండా వికెట్ టేకర్ అయిఉండాలి.
3) గాయపడని ఫాస్ట్ బౌలర్ భారత జట్టుకు చాలా అవసరం. 4) మరో ముఖ్యవిషయం ఏంటంటే కెప్టెన్లను మారిస్తే కప్పులు రావు. సారథులను మార్చినంత మాత్రానా ఫలితాలు మారవు. ఆడే విధానంలో మార్పులు రావాలి..’అని ట్వీట్ చేశాడు.
అంతకుముందు ఇర్ఫాన్, సారథిగా హార్ధిక్ పాండ్యాను నియమించాలన్న డిమాండ్ పై స్పందిస్తూ... ‘చూడండి.. కెప్టెన్ ను మారిస్తే ఫలితాలు మారవు. హార్ధిక్ పాండ్యాను సారథిగా నియమించాలని అంటున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే.. పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్.
అతడు కూడా గాయాలకు అతీతుడు కాదు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల ముందు జట్టు సారథి గాయపడితే ఎలా..? ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా సక్సెస్ అయ్యాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ లో ఒకడే కాకుండా గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉండాలి..’ అని తెలిపాడు.