IPL 2025: పేరుకే కాదు సంపదలోనూ వరుణ్ 'చక్రవర్తి'నే!
IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తన మాయాజాల స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడించిన వరుణ్ చక్రవర్తి.. పేరుకే కాదు సంపదలోనూ చక్రవర్తినే ! అతని ఐపీఎల్ ఆదాయం, ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Varun Chakravarthy wealth: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మే 18 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 2025లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత మే 20న క్వాలిఫయర్ మొదటి మ్యాచ్ జరుగుతుంది. మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మే 23న క్వాలిఫయర్ 2వ మ్యాచ్ జరుగుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఆర్కిటెక్ట్ నుంచి భారత క్రికెట్ ఆటగాడిగా మారిన వరుణ్ చక్రవర్తి
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై అందరిచూపు ఉంటుంది. తన స్పిన్ మాయాజాలంతో భారత్ కు అద్భుత విజయాలు అందించిన వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపడానికి సిద్ధమవుతున్నాడు.
అయితే, వరుణ్ చక్రవర్తి పేరుకే కాదు సంపాదనలోనూ చక్రవర్తినే. ఒక ఆర్కిటెక్ట్ నుంచి భారత క్రికెట్ ఆటగాడిగా మారిన అతని ప్రయాణం అసాధారణమైనది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన అతను ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున ఆడుతున్న వరుణ్ చక్రవర్తి
2018లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో (టీఎన్‌పీఎల్) చోటు దక్కించుకుని అదరగొట్టడంతో 2019లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో చేరిన తర్వాతే స్పిన్నర్‌గా నిలదొక్కుకున్నాడు. కోల్‌కతా జట్టులో నిలకడగా రాణిస్తుండటంతో గత ఐపీఎల్ వేలంలో రూ.12 కోట్లకు ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకుంది. గత రెండు సీజన్లుగా 20 వికెట్లకు పైగా తీసిన అతను కేకేఆర్ బౌలింగ్ విభాగంలో కీలకంగా మారాడు.
వరుణ్ చక్రవర్తి అంచనా నికర విలువ రూ.40 కోట్లు
వరుణ్ చక్రవర్తి 2021లో శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 18 టీ20 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లకు పైగా ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు. అతనికి ఇంకా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేనప్పటికీ, అతను ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నందుకు రూ.1 లక్ష సంపాదిస్తున్నాడు. అలాగే, వరుణ్ చక్రవర్తి లోగో, ఆసిక్స్, విజనరీ 11, కోలెక్సియన్ వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బ్రాండ్ ఒప్పందానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నాడు.
వరుణ్ చక్రవర్తి గ్యారేజీలో విలువైన కార్లు కూడా ఉన్నాయి. చక్కటి డిజైన్, అధునాతన సాంకేతికతకు పేరుగాంచిన ఆడి క్యూ3, బీఎండబ్ల్యూ ఎక్స్1 కార్లు ఉన్నాయి. క్రిక్ ట్రాకర్ ప్రకారం వరుణ్ చక్రవర్తి అంచనా నికర విలువ రూ.40 కోట్లుగా ఉంది. అతనికి ఆదాయం ఐపీఎల్ ఒప్పందాలు, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ కాంట్రాక్టులు, పెట్టుబడుల ద్వారా వస్తుంది.

