చహల్ కొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల రికార్డు సొంతం
Most Wickets in IPL: రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా ఈ లీగ్ లో..

టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో నితీశ్ రాణా వికెట్ తీయడం ద్వారా చహల్.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు.
కేకేఆర్ తో మ్యాచ్ లో చహల్.. 11వ ఓవర్లో రెండో బంతికి నితీశ్ రాణాను ఔట్ చేయడంతో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ లీగ్ లో చహల్ కు ఇది 184వ వికెట్ కావడం గమనార్హం. తద్వారా అతడు చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో (183 వికెట్లు) రికార్డును బ్రేక్ చేశాడు.
ఇటీవలే సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముగిసిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి బ్రావో రికార్డును సమం చేసిన చహల్.. తాజా మ్యాచ్ లో రాణాను ఔట్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
చహల్ ఘనతతో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ఉండగా అత్యధిక వికెట్ల జాబితాలో కూడా మరో భారతీయుడే అగ్రస్థానంలో ఉన్నట్టైంది. ఐపీఎల్ లో హయ్యస్ట్ వికెట్ టేకర్స్ లో చహల్ (184), బ్రావో (183) తర్వాత పియుష్ చావ్లా (174), అమిత్ మిశ్రా (172)
అశ్విన్ (171) లు తదుపరి స్థానాల్లో ఉన్నారు.
183 వికెట్లు తీయడానికి బ్రావో 161 మ్యాచ్ లు తీసుకోగా చమల్ 143 మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించాడు. ఇదే సీజన్ లో చహల్.. బ్రావో తో పాటు లసిత్ మలింగ 170 వికెట్ల రికార్డును కూడా బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
2013 సీజన్ లో ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన చహల్ తన కెరీర్ ను ముంబై ఇండియన్స్ తో ప్రారంభించాడు. కానీ 2014 సీజన్ నుంచి 2021 వరకూ ఆర్సీబీకి ఆడిన చహల్.. ఆ జట్టుకు 113 మ్యాచ్‌లలో 130 వికెట్లు పడగొట్టాడు. 2022 సీజన్ కు ముందు చహల్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వెళ్లాడు. వేలంలో చహల్ ను రాజస్తాన్ దక్కించుకుంది. ఈ రెండు సీజన్లలో అతడు రాజస్తాన్ తరఫున ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడిన అతడు.. 45 వికెట్లు పడగొట్టాడు.