- Home
- Sports
- Cricket
- 34 డాట్ బాల్స్ ఆడినోళ్లు గెలుస్తరా..? రాడ్ బ్యాటింగ్ ఇది : ఢిల్లీ బ్యాటర్లపై పాంటింగ్ ఫైర్
34 డాట్ బాల్స్ ఆడినోళ్లు గెలుస్తరా..? రాడ్ బ్యాటింగ్ ఇది : ఢిల్లీ బ్యాటర్లపై పాంటింగ్ ఫైర్
IPL 2023: ఐపీఎల్ -16 లో బుధవారం చెన్నైతో ముగిసిన మ్యాచ్ లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది ఢిల్లీ క్యాపిటల్స్.

Image credit: PTI
ఈ సీజన్ ను వరుసగా ఐదు అపజయాలతో ఆరంభించి తర్వాత పడుతూ లేస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నైని ఫస్ట్ 167 పరుగులకే పరిమితం చేసిన ఢిల్లీ.. తర్వాత ఈజీ టార్గెట్ ను ఛేదించేందుకు తంటాలుపడి 140 పరుగుల వద్దే ఆగిపోయింది.
తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని.. మిడిల్ ఓవర్స్ లో తాము అనుకున్నంత స్కోరు చేయడంలో విఫలమయ్యామని కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అయితే తమ బ్యాటర్ల ఆటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20లలో 34 డాట్ బాల్స్ ఆడితే ఎలా గెలుస్తామని అసహనం వ్యక్తం చేశాడు.
Image credit: PTI
మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్ లో పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో మాకు గెలిచే అవకాశాలున్నా ఓడిపోయాం. వాస్తవానికి మిడిల్ ఓవర్స్ లోనే మా ఓటమి ఖరారైంది. మా బ్యాటర్లు స్పిన్ లో మరింత ధాటిగా ఆడాల్సింది. మిడిల్ ఓవర్స్ లో మేం 34 డాట్ బాల్స్ ఆడాం. టీ20లో గేమ్ మధ్యలో ఇన్ని డాట్ బాల్స్ ఆడితే గెలవడం చాలా కష్టం..’ అని చెప్పాడు.
దీంతో పాటు ఛేదనలో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోవడం మా విజయావకాశాలను దెబ్బతీసిందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ‘నాకు తెలిసి ఈ సీజన్ లో మేం ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోవడం ఇది ఆరో సారో లేక ఏడో సారో. ఒకసారైతే మేం ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లూ కోల్పోయాం. ఆ విషయంలో మేం ఇంతవరకూ మెరుగుపడలేదు. కొన్నిసార్లు ఇది మా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించింది...’అని తెలిపాడు.
ఇక ఈ సీజన్ లో తమ జట్టులో ఉన్న ఇండియన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారని, వారిపై భారీ ఆశలు పెట్టుకున్నా ఒక్కరు కూడా అంచనాలకు మించి రాణించలేదని పాంటింగ్ చెప్పాడు. మనీష్ పాండే సీజన్ ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత విఫలమయ్యాడని, ఇక పృథ్వీ షా అయితే తన వైఫల్యాల నుంచి బయటపడలేదని అన్నాడు.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు పృథ్వీ షా, మనీష్ పాండే, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, పొరెల్, అమన్ ఖాన్ వంటి పలువురు ఆటగాళ్లు వచ్చినా వాళ్లు విఫలమయ్యారు. ఒక్క అక్షర్ పటేల్ మాత్రమే మెరుగ్గా రాణించాడు.