- Home
- Sports
- Cricket
- టాప్లీ ప్లేస్‌లో సఫారీ ఆల్ రౌండర్‌ను పట్టుకొస్తున్న ఆర్సీబీ..! తర్వాతి మ్యాచ్‌లో డైరెక్ట్ ఎంట్రీ
టాప్లీ ప్లేస్‌లో సఫారీ ఆల్ రౌండర్‌ను పట్టుకొస్తున్న ఆర్సీబీ..! తర్వాతి మ్యాచ్‌లో డైరెక్ట్ ఎంట్రీ
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గాయపడ్డ ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ స్థానంలో ఆ జట్టు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ను తీసుకొస్తున్నది.

ఐపీఎల్-16లో భాగంగా ముంబై ఇండియన్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే గాయపడ్డ రీస్ టాప్లీ ఈ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. భుజం గాయంతో టాప్లీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆర్సీబీ కొత్త ప్లేయర్ ను ప్రకటించాల్సి ఉంది.
అయితే టాప్లీ స్థానాన్ని సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వేన్ పార్నెల్ భర్తీ చేయనున్నట్టు సమాచారం. దీనిపై ఆర్సీబీ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించకపోయినా.. బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ ఇదివరకే పార్నెల్ తో మాట్లాడిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. క్లబ్ క్రికెట్ ఎస్ఎ లో వచ్చిన నివేదిక ఆధారంగా పార్నెల్ త్వరలోనే ఆర్సీబీతో చేరతాడని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ఒప్పందానికి సంబంధించిన తతంగం అంతా పూర్తయిందని.. నేడో రేపో పార్నెల్ సౌతాఫ్రికా నుంచి బెంగళూరుకు రానున్నాడని తెలుస్తున్నది. రాగానే అతడిని మ్యాచ్ కూడా ఆడించే అవకాశాలున్నాయి. ఈనెల 10న బెంగళూరు.. చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ పోరుకు పార్నెల్ ఆడనున్నట్టు సమాచారం.
పార్నెల్ కూడా 2022 లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అతడి బేస్ ప్రైస్ ను రూ. 75 లక్షలుగా నిర్ణయించింది. కానీ ఆశ్చర్యకరంగా ఏ జట్టు కూడా పార్నెల్ ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.
Image credit: PTI
33 ఏండ్ల ఈ సఫారీ బౌలర్.. ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఎస్ఎ 20లో ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టుబడులు పెట్టిన ప్రిటోరియా క్యాపిటల్స్ లో భాగమయ్యాడు. పార్నెల్ గతంలో ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణె వారియర్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ లో 26 మ్యాచ్ లు ఆడిన పార్నెల్.. 26 వికెట్లు పడగొట్టాడు.
Image credit: PTI
సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడిన పార్నెల్.. బౌలింగ్ తో పాటు బ్యాట్ తో కూడా పరుగులు రాబట్టగలడు. దక్షిణాఫ్రికా జట్టు తరఫున 6 టెస్టులు, 73 వన్డేలు, 55 టీ20లు ఆడిన పార్నెల్... టెస్టులలో 15, వన్డేలలో 99, టీ20లలో 59 వికెట్లు తీశాడు.