- Home
- Sports
- Cricket
- ఇదేం కొత్త కాదుగా! ప్రతీ సీజన్‌లో జరిగేదే... ఆర్‌సీబీ ఓటమి, విరాట్ కోహ్లీ కన్నీళ్లు, ఫ్యాన్స్ గగ్గోలు...
ఇదేం కొత్త కాదుగా! ప్రతీ సీజన్‌లో జరిగేదే... ఆర్‌సీబీ ఓటమి, విరాట్ కోహ్లీ కన్నీళ్లు, ఫ్యాన్స్ గగ్గోలు...
ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ఆశపడడం, ఒకటి రెండు విజయాలతో రెచ్చిపోవడం, సీజన్ మధ్యలో పరాజయాలతో కంగారు పడడం, ఆఖరికి నిరాశతో వచ్చేసారి చూసుకుందాంలే అని వెనుదిరగడం.. ఆర్‌సీబీకి 16 సీజన్లుగా ఆనవాయితీగా వస్తున్న అలవాటు. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యింది...

Image credit: PTI
సీజన్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత కప్ గెలిచేసినట్టు హడావుడి చేసిన ఆర్‌సీబీ బ్యాచ్, రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల తేడాతో విజయం అందుకున్న తర్వాత రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న తర్వాత ఆర్‌సీబీ, ఇక ప్లేఆఫ్స్ చేరిపోయామని ఫిక్స్ అయిపోయింది...
గుజరాత్ టైటాన్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ కూడా మనదేనని ఫిక్స్ అయ్యారు ఆర్‌సీబీ బ్యాచ్. అయితే వింటేజ్ ఆర్‌సీబీ బౌలింగ్ ఎప్పటిలాగే హ్యాండ్ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌ని 59 పరుగులకి ఆలౌట్ చేసి, ఆ టీమ్‌ని ప్లేఆఫ్స్ చేరకుండా చేసిన ఆర్‌సీబీ బౌలర్లు, టైటాన్స్ బ్యాటర్లకు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు..
ఫలితం వరుసగా నాలుగో సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరాలని అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆరో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఎప్పటిలాగే ఆర్‌సీబీ, టైటిల్ పోరు నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు...
ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్.. ఈ మూడు టీమ్స్‌కీ, ఆర్‌సీబీకి పెద్ద తేడా ఏమీ లేదు. నాలుగు టీమ్స్‌లో కూడా స్టార్ ప్లేయర్లు ఉన్నారు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే ఆర్‌సీబీలో మాత్రం దరిద్రం తిష్ట వేసి కూర్చుంది.. తేడా మేనేజ్‌మెంట్ టీమ్‌ని నడిపించే విధానంలో ఉంది.
విరాట్ కోహ్లీ, అప్పట్లో ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, ఇప్పుడు ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్... మహ్మద్ సిరాజ్... ఇలా నలుగురు ప్లేయర్లు తప్ప, మిగిలిన వాళ్లు ఎవ్వరూ కూడా ఇది మా టీమ్, మేం గెలిచి తీరాలి అనే కసితో ఆడడం ఆర్‌సీబీలో కనబడదు. ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉండవు, అది పక్కా కమర్షియల్ సినిమా...
RCB vs GT
ఆర్‌సీబీ ప్లేయర్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తుంది, వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తుంది. కావాలంటే ప్లేయర్ల గర్ల్ ఫ్రెండ్స్‌కి, వాళ్ల కుటుంబాలకు కూడా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, హోటళ్లలో ఏసీ రూమ్స్ బుక్ చేసి వీఐపీల్లా చూసుకుంటుంది...
Image credit: PTI
అచ్చు కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే ఎన్ని చేసినా, ఇది మా టీమ్, ఈ టీమ్ కోసం మేం గెలవాలనే కసి మాత్రం ప్లేయర్లలో పుట్టించడంలో ఫెయిల్ అవుతోంది. ఇది మారనంత కాలం, ఎన్ని సీజన్లు మారినా, ఎంత మంది కెప్టెన్లు మారినా ఫాఫ్ డుప్లిసిస్ ఆరంభంలో చెప్పినట్టు ఆర్‌సీబీ ‘ఈ సాలా కప్ నహీ’... అనేది మాత్రం మారదు..
rcb
ఐపీఎల్ స్క్రిప్టు ప్రకారమే నడుస్తుందని చాలా రకాల అనుమానాలు రేగాయి. అయితే అదే నిజమైతే కొన్ని కోట్ల మంది అభిమానించే ఆర్‌సీబీ, ఇప్పటిదాకా ఒక్క టైటిల్ గెలిచేలా స్క్రిప్టు ఎందుకు రాయడం లేదనేది చాలామంది ఫ్యాన్స్ ఆవేదన, ఆక్రోశం... కనీసం ఆర్‌సీబీ కప్పు కొట్టకపోవడం వల్ల ఐపీఎల్ స్క్రిప్టు కాదని నమ్ముతున్నారు చాలామంది జనాలు..