- Home
- Sports
- Cricket
- ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్‌ని తొలగించిన ఐసీసీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి...
‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్‌ని తొలగించిన ఐసీసీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి...
క్రికెట్‌లో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఒకటి. టీవీ రిప్లైలో కూడా స్పష్టంగా నిర్ణయించలేని సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని ‘సాఫ్ట్ సిగ్నల్’గా పరిగణనలోకి తీసుకుని, దాన్నే ఫైనల్‌గా ప్రకటించేవాళ్లు. ఇకపై అది వర్తించదు..

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య 2021 మార్చి నెలలో జరిగిన టీ20 సిరీస్ సమయంలో ఈ సాఫ్ట్ సిగ్నల్ గురించి తీవ్రమైన చర్చ జరిగింది. అదే సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, నాలుగో టీ20లో వివాదాస్పదకర రీతిలో అవుట్ అయ్యాడు...
సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ని డేవిడ్ మలాన్ అందుకున్నాడు. అయితే టీవీ రిప్లైలో బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయాడు. బంతి నేలను తాకుతుందో లేదో స్పష్టంగా తెలియడం లేదని, ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో దాన్ని పరిగణనలో తీసుకుంటూ ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్ ప్రకారం సూర్య అవుటైనట్టు ప్రకటించాడు..
ఈ నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. అలాగే వాషింగ్టన్ సుందర్ కొట్టిన క్యాచ్‌ని అందుకునే ప్రయత్నంలో అదిల్ రషీద్ కాలు, బౌండరీ లైన్‌కి తాకింది. అంటే భారత ఖాతాలో సిక్సర్ చేరాలి. అయితే ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్‌గా ప్రకటించడం, థర్డ్ అంపైర్ టీవీ రిప్లైలో బంతి, బౌండరీకి తాకుతుందో లేదో తెలియడం లేదని... సుందర్ అవుటైనట్టు ప్రకటించడం జరిగిపోయాయి..
ఈ వివాదాస్పద నిర్ణయాల కారణంగా 2021 సీజన్ నుంచి ఐపీఎల్‌లో ఈ ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్‌ని తొలగించారు. రెండేళ్ల తర్వాత ఐసీసీ కూడా ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్ పనికి రానిదిగా గుర్తించి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 నుంచి ఆ రూల్ ఉండదని పేర్కొంది...
ఈ లెక్కన ఫీల్డ్ అంపైర్, ఏదైనా నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేస్తే... సాఫ్ట్ సిగ్నల్ ప్రకటించే అవకాశం ఉండదు. సాఫ్ట్ సిగ్నల్ ప్రకటించినా దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఉదాహరణకి ఎవరైనా బ్యాటర్ కొట్టిన షాట్, ఫీల్డర్ క్యాచ్ పట్టి.. బాల్ కింద తాకిందో లేదో తెలియకపోతే, ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద బ్యాటర్‌కి అనుకూలంగా ఫలితం వెలువరించాల్సి ఉంటుంది..
అంతేకానీ టీవీ రిప్లైలో సరిగ్గా తెలియడం లేదు కాబట్టి ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి బ్యాటర్ అవుట్ అని ప్రకటించడానికి వీలు ఉండదు. జూన్ 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ జరగనుంది.