- Home
- Sports
- Cricket
- జైస్వాల్ నెక్స్ట్ లెవల్ బ్యాటర్.. హిట్‌మ్యాన్ ప్రశంసలు.. టీమిండియాలోకి ఎంట్రీ పాస్ వచ్చినట్టే!
జైస్వాల్ నెక్స్ట్ లెవల్ బ్యాటర్.. హిట్‌మ్యాన్ ప్రశంసలు.. టీమిండియాలోకి ఎంట్రీ పాస్ వచ్చినట్టే!
IPL 2023: రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ పై వీరవిహారం చేసి సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

Yashasvi Jaiswal
ముంబైలో పుట్టి పెరిగి, దేశవాళీలో అదే జట్టుకు ఆడుతూ ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అతడు ‘నెక్స్ట్ లెవల్ బ్యాటర్’అంటూ కొనియాడాడు. జైస్వాల్ బ్యాటింగ్ లో పవర్ ఉందని తెలిపాడు.
ముంబై - రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో మాట్లాడుతూ.. ‘నేను జైస్వాల్ బ్యాటింగ్ ను గతేడాది నుంచి చూస్తున్నా. అతడు నెక్స్ట్ లెవల్ బ్యాటర్. ఇవాళ్టి మ్యాచ్ లో జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత నేను అతడితో నీకు ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను..
దానికి అతడు తాను తరుచూ జిమ్ కు వెళ్తున్నానని, అందువల్లే ఇంత అవలీలగా సిక్సర్లు కొడుతున్నానని చెప్పాడు. ఈ మ్యాచ్ లో అతడి ఆట అద్భుతం. ఇది అతడికి వ్యక్తిగతంగానే గాక రాజస్తాన్ రాయల్స్ కు.. మరీ ముఖ్యంగా టీమిండియాకు చాలా మేలు చేసేదే..’అని తెలిపాడు.
కాగా రోహిత్ కంట్లో పడటంతో జైస్వాల్‌కు ఇక టీమిండియాలోకి ఎంట్రీ పాస్ దొరికినట్టేనని వాదనలు వినిపిస్తున్నాయి. 2020లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. ఆది నుంచి రాజస్తాన్ తరఫునే ఆడుతున్నాడు. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న అతడు ఈ సీజన్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
ఐపీఎల్ -16లో జైస్వాల్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 428 పరుగులు సాధించి ప్రస్తుతానికి సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో టెక్నిక్, దూకుడు, ఎంతటి బౌలర్ అయినా బెదురులేకుండా ఎదుర్కునే మనస్తత్వంతో ఉన్న యశస్వి నిలకడగా రాణిస్తున్నాడు. టీ20లలో ప్రపంచంలోనే తోపు అనదగ్గ జోస్ బట్లర్ కూడా యశస్వి ముందు తేలిపోతున్నాడంటే జైస్వాల్ ఏ రేంజ్ లో చెలరేగుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Image credit: PTI
ఇక తాజాగా రోహిత్ కూడా జైస్వాల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు అతడి బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఆరా తీయడంతో టీమిండియాలోకి రావడం యాధృశ్చికమే అని అభిమానులు భావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా యశస్విని బరిలోకి దించాలని కోరుతున్నారు. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసేనో..?