కోహ్లీ, సంజూ రికార్డులను బ్రేక్ చేసిన గిల్.. అత్యంత పిన్న వయస్కుడిగా..
IPL 2023: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్ లో గిల్.. కోహ్లీ, సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్ లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న అత్యంత పిన్న వయస్కులలో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే గతంలో ఈ రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, సురేశ్ రైనాల పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భాగంగా సునీల్ నరైన్ వేసిన 7 వ ఓవర్లో బౌండరీ బాదడం ద్వారా గిల్ ఐపీఎల్ లో 2 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ లో ఈ ఘనత అందుకున్న అత్యంత పిన్న వయస్కులలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం గిల్ వయస్సు 23 ఏండ్ల 214 రోజులు. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ సారథి రిషభ్ పంత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పంత్.. 23 ఏండ్ల 27 రోజుల్లోనే ఐపీఎల్ లో 2 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.
పంత్, గిల్ తర్వాత సంజూ శాంసన్.. 24 ఏండ్ల 140 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు. శాంసన్ తర్వాత ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ.. 24 ఏండ్ల 175 రోజులకు రెండు వేల పరుగుల మార్కును దాటాడు ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా.. ఐదో స్థానంలో ఉన్నాడు. రైనా.. 25 ఏండ్ల 155 రోజులకు 2 వేల పరుగుల మార్కును దాటాడు.
శుభ్‌మన్.. 2018లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాది అండర్ -19 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. 2021 సీజన్ వరకూ కేకేఆర్ తోనే ఉన్న గిల్.. 2022 నుంచి గుజరాత్ కు ఆడుతున్నాడు.
ఇక కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్ (53) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (39) కూడా ఫామ్ కొనసాగించాడు. చివర్లో విజయ్ శంకర్.. 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.