డికాక్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ : లక్నో ఓపెనర్‌పై కృనాల్ షాకింగ్ కామెంట్స్
IPL 2023: ఐపీఎల్-16లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ పై ఆ జట్టు తాత్కాలిక సారథి కృనాల్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు. డికాక్ బద్దకానికి బ్రాండ్ అంబాడిసిడర్ అని..

ఐపీఎల్-16 లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యులర్ కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయపడటంతో తాత్కాలిక సారథిగా గత రెండు మ్యాచ్ లుగా లక్నోను నడిపిస్తున్న నాయకుడు కృనాల్ పాండ్యా ఆ టీమ్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. డికాక్ బద్దకస్తుడని వాపోయాడు.
లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో కృనాల్ ఈ కామెంట్స్ చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ తో కలిసి సందడి చేసిన కృనాల్.. డికాక్ అంత బద్దకస్తుడిని తాను ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చాడు.
లక్నో టీమ్ లో లేజియెస్ట్ ప్లేయర్ ఎవరు..? అని అడిగిన ప్రశ్నకు పూరన్ స్పందిస్తూ కైల్ మేయర్స్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నకు కృనాల్ సమాధానం చెబుతూ.. ‘క్వింటన్ డికాక్.. అతడు ఎంత లేజీ అంటే.. ఒకవేళ అతడు ఓ 8-9 గంటలు పడుకున్నా కూడా లేచిన వెంటనే ‘అబ్బ, నేను చాలా అలిసిపోయా’ అన్నట్టుగా ఫేస్ పెడతాడు..’ అని అన్నాడు.
Image credit: PTI
ఇక టీమ్ లో రాక్ స్టార్ ఎవరు అని పూరన్ ను అడగ్గా అతడు అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ ల పేర్లు చెప్పాడు. ఇదే ఇంటర్వ్యూలో పూరన్.. ఆషికీ - 2 సినిమాలో అరిజిత్ సింగ్ పాడిన ‘తుమ్హిహో’ పాటతో పాటు ‘ఓ మాహీ’ సాంగ్ కూడా పాడాడు.
ఐపీఎల్ -16లో లక్నో విషయానికొస్తే ఆడిన 11 మ్యాచ్ లలో ఆ జట్టు ఐదు మాత్రమే గెలిచి ఐదింట్లో ఓడింది. చెన్నైతో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్ లో లక్నో తమ తదుపరి మ్యాచ్ ను ఈనెల 13న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది.