Arshdeep Singh: స్టంప్స్ పగలగొట్టావ్ సరే.. ఒక్కోటి ఎంత కాస్టో తెలుసా..?
IPL 2023: ఐపీఎల్ - 16లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో పంజాబ్ కింగ్స్ దే పైచేయి అయింది. శనివారం వాంఖెడే స్టేడియంలో పంజాబ్.. ముంబైని 13 పరుగుల తేడాతో ఓడించింది.

Image credit: PTI
ఐపీఎల్ - 16లో శనివారం ముంబై ఇండియన్స్ - పంజబ్ కింగ్స్ నడుమ జరిగిన మ్యాచ్ ఈ సీజన్ లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ గా ముగిసింది. 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై.. విజయానికి చేరువగా వచ్చింది. కానీ ముంబై ఓటమికి, పంజాబ్ గెలుపునకు ఉన్న ఏకైక తేడా అర్ష్‌దీప్ సింగ్. ఈ మ్యాచ్ లో అతడు నాలుగు ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
లాస్ట్ ఓవర్ లో అర్ష్‌దీప్ వేసిన ఓవర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎవరు మర్చిపోయినా బీసీసీఐ మాత్రం ఈ ఓవర్ ను మరిచిపోదు. ఒక్కసారి కాదు.. ఏకంగా రెండు సార్లు మిడిల్ స్టంప్ ను విరగ్గొట్టిన బౌలర్ ను బోర్డు ఎందుకు మరిచిపోతుంది...? వాటి కాస్ట్ అంత ఉంది మరి.
ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్.. మూడు, నాలుగు బంతులకు తిలక్ వర్మ, నెహల్ వధేరాలను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో అతడు వేసిన యార్కర్ల వేగానికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది. రెండుసార్లు ఇలాగే జరిగింది.
ఐపీఎల్ లో బీసీసీఐ ఎల్‌ఈడీ స్టంప్స్ ను వాడుతున్నది. రనౌట్ గానీ బౌల్డ్ అయినప్పుడు గానీ, స్టంపౌట్ సమయంలో బంతి స్టంప్స్ ను తాకగానే అవి జిగేల్‌మంటూ వెలుగుతాయి. వీటి ధర ఏ వెయ్యో రెండు వేలో అనుకుంటే పొరబడ్డట్టే. ఒక ఎల్ఈడీ స్టంప్స్ సెట్ ధర రూ. 24 లక్షలు (ఒక సెట్ లో మూడు ఉంటే ఒక్కోటి రూ. 8 లక్షలు). స్టంప్స్ తో పాటు వాటిమీద ఉపయోగించే బెయిల్స్ తో కలిపి ఒక సెట్ ధర రూ. 30 లక్షలుగా ఉంది.
అర్ష్‌దీప్ రెండు సార్లు వికెట్లను బ్రేక్ చేయడం ద్వారా బోర్డుకు ఇంచుమించు ఓ రూ. 20 లక్షలు బొక్కపెట్టినట్టే. ఐపీఎల్ ద్వారా లక్ష కోట్ల ఆదాయం గడిస్తున్న (?) బీసీసీఐకి ఇదేం పెద్ద అమౌంట్ కాకపోయినా ఐపీఎల్ లో విలువపరంగా మాత్రం మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవర్ ఇదే అయ్యిందని సోషల్ మీడియా లో నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
నిన్నటి మ్యాచ్ లో ముంబై విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా కరన్.. అర్ష్‌దీప్ సింగ్ కు బాల్ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ లో ఫుల్ టాస్. ఒక పరుగు మాత్రమే వచ్చింది. రెండో బాల్ కు పరుగులేమీ రాలేదు. మూడో బాల్ కు తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్. ఈ బంతికి మద్యలో వికెట్ విరిగిపోయింది. నాలుగో బాల్ కు నెహల్ వధేరా.. సేమ్ సీన్ రిపీట్. ఈ బాల్ కూ వికెట్ రెండు ముక్కలైంది. తర్వాత జోఫ్రా ఆర్చర్ రెండు బంతుల్లో ఒక్క పరుగే చేశాడు. ఈఓవర్లో అర్ష్‌దీప్ 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి ముంబైని ఓడించాడు.
ఇక ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా అర్ష్‌దీప్.. అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా నిలిచాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన అర్ష్‌దీప్.. 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్, రషీద్ ఖాన్ లు 12 వికెట్లతో రెండు, మూడో స్థానాలలో ఉండగా మార్క్ వుడ్, చాహల్ లు 11 వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు