ఫుల్ టాస్ మ్యాచ్ లాస్.. రాజస్తాన్ ఓటమికి కారణం ఆ బౌలరే..
IPL 2023: ఐపీఎల్ -16లో ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆదివారం ముగిసిన ఉత్కంఠ పోరులో రోహిత్ సేన డబుల్ సెంచరీ టార్గెట్ ను మరో 3 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై.. 215 పరుగుల టార్గెట్ ను మరో 3 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డులు సృష్టించింది. మ్యాచ్ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓటమికి కారణం కచ్చితంగా జేసన్ హోల్డరే అని చెప్పక తప్పదు.
ఈ మ్యాచ్ లో హోల్డర్ 3.3 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయకపోయాగా లాస్ట్ ఓవర్ లో మొత్తం ఫుల్ టాస్ లు వేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. టిమ్ డేవిడ్ చివరి ఓవర్లో కొట్టిన మూడు సిక్సర్లు ఫుల్ టాస్ గా వచ్చినవే.
ముంబై ఇన్నింగ్స్ 16 ఓవర్లు ముగిసేసరికి 156- 4 గా ఉంది. 17వ ఓవర్ ను సంజూ.. హోల్డర్ కు ఇచ్చాడు. డెత్ ఓవర్లలో బాగా వేయగల హోల్డర్ అంతర్జాతీయ స్థాయి అనుభవం కూడా ఉండటంతో శాంసన్ అతడిని నమ్మాడు. కానీ హోల్డర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
17వ ఓవర్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్. తిలక్ వర్మ ఫోర్ కొట్టాడు. రెండు, మూడు, నాలుగు, ఆరో బాల్ కూడా ఫుల్ టాస్ లే. ఇందులొ నాలుగో బంతిని టిమ్ డేవిడ్ సిక్సర్ గా మలిచాడు. తర్వాత రెండు ఓవర్లలో బౌల్డ్ 18వ ఓవర్లో 11 పరుగులిచ్చాడు. 19వ ఓవర్లో సందీప్ శర్మ 15 పరుగులిచ్చాడు.
(Image : PTI)
ఇక చివరి ఓవర్లో ముంబై విజయానికి 17 పరుగులు కావాలి. శాంసన్ మళ్లీ హోల్డర్ కే బాల్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో ఫస్ట్ బాల్ లో ఔట్ సైడ్ ఆఫ్ దిశగా లో ఫుల్ టాస్. బాల్ అంపైర్ తలమీదుగా వెళ్లి స్ట్రెయిట్ సిక్సర్ అయ్యింది. రెండో బాల్ మరో ఫుల్ టాస్. ఈసారి బాల్ మిడ్ వికెట్ మీదుగా వెళ్లి ప్రేక్షకుల్ చేతుల్లో పడింది.
Image : PTI
అప్పటికే ముంబై విజయం దాదాపు ఖాయమైంది. మూడో బాల్ కూడా మరో ఫుల్ టాస్ వేశాడు హోల్డర్. రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న తిలక్ వర్మ వచ్చి టిమ్ డేవిడ్ పైకి ఎగిరి హగ్ చేసుకున్నాడు. ముంబై శిబిరంలో ఆనందోత్సాహాలు. రాజస్తాన్ ఆటగాళ్ల ముఖాల్లో రక్తం లేదు. హోల్డర్ పుణ్యమా అని అసలు గెలుస్తుందో లేదో తెలియని మ్యాచ్ ను ముంబై మరో మూడు బాల్స్ ఉండగానే ఛేదించేసింది.