కోహ్లీ - గంభీర్‌ల మధ్య జరిగిందిదే.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాలు..
IPL 2023: కోహ్లీ - గంభీర్ ల మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది..? వాళ్లు ఏం మాట్లాడుకున్నారు..? ఇప్పుడిదే హాట్ టాపిక్.

ఐపీఎల్ -16లో లక్నో - బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ - గంభీర్ లు మరోసారి వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మీదే తప్పు అంటే కాదు కాదు మీదే అని ఇరువురు ఆటగాళ్ల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది.
అయితే అసలు వాస్తవంగా అక్కడ జరిగిందేంటి..? కోహ్లీ - గంభీర్ ల మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది..? వాళ్లు ఏం మాట్లాడుకున్నారు..? బెంగళూరులో గంభీర్ చిన్నస్వామి స్టేడయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ చేసిన ‘నోర్మూసుకోండి’ సంజ్ఞలకు కోహ్లీకి కాలిందా..? ఈ హైఓల్టేజ్ రివేంజ్ డ్రామాను అక్కడ ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాడు. ఆ వివరాలివిగో..
‘‘లక్నో - ఆర్సీబీ మ్యాచ్ ముగిశాక ఏం జరిగిందో మీరందరూ టీవీలలో చూశారు. అయితే ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్స్ తర్వాత కైల్ మేయర్స్ కోహ్లీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. కోహ్లీతో మేయర్స్.. ‘నువ్వెందుకు ప్రతీసారి మమ్మల్ని నిందిస్తున్నావ్..?’ అని ప్రశ్నించాడు. అప్పుడు కోహ్లీ కూడా ‘మరి నువ్వెందుకు నన్ను కోపంగా చూస్తున్నావ్..?’ అని బదులిచ్చాడు.
వీళ్లిద్దరి మధ్య చర్చ సాగుతుండగా అక్కడికి వచ్చిన గౌతం గంభీర్ మేయర్స్ ను అక్కడ్నుంచి తీసుకెళ్తూ కోహ్లీతో ‘అతడితో ఏం మాట్లాడుతున్నావ్..?’అని అన్నాడు. అప్పుడు కోహ్లీ.. ‘నేను నిన్నేమీ అనలేదు. అయినా మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావ్?’అని ప్రశ్నించాడు.
కోహ్లీ మాటలకు గంభీర్ స్పందిస్తూ... ‘మా టీమ్ ప్లేయర్లు నాకు ఫ్యామిలీతో సమానం. నువ్వు మా జట్టు ఆటగాళ్లను తిడుతున్నావంటే నా కుటుంబాన్ని తిట్టినట్టే.. ’ అని కాస్త గట్టిగానే బదులిచ్చాడు. కానీ కోహ్లీ కూడా.. ‘అయితే నీ కుటుంబసభ్యులను అదుపులో పెట్టుకో..’అని అన్నాడు. ఇది గంభీర్ కు కోపం తెప్పించింది.
కోహ్లీ మాటలకు సహనం కోల్పోయిన గంభీర్.. ‘ఆ నీ దగ్గరే నేర్చుకోవాలి నేను..’అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడే ఇరు జట్ల ఆటగాళ్లు గొడవ మరింత పెద్దది కాకుండా వాళ్లను పక్కకు తీసుకెళ్లారు..’’అని లక్నో టీమ్ లోని ఓ వ్యక్తి పీటీఐతో ఈ వివరాలు వెల్లడించాడు.