- Home
- Sports
- Cricket
- అప్పుడు వదిలేశారు, ఇప్పుడు ఫీలవుతున్నారు... చాహాల్, వార్నర్, హార్ధిక్ పాండ్యాతో పాటు...
అప్పుడు వదిలేశారు, ఇప్పుడు ఫీలవుతున్నారు... చాహాల్, వార్నర్, హార్ధిక్ పాండ్యాతో పాటు...
ఐపీఎల్ ప్రపంచంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ రోజు ఓ టీమ్‌లో ఉన్న ప్లేయర్, వచ్చే సీజన్‌లో ఇంకో ఫ్రాంఛైజీ తరుపున ఆడొచ్చు. అలా ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ‘మాకు వద్దు బాబోయ్’ అని వదిలేసిన కొందరు ప్లేయర్లు, ఈ సీజన్‌లో కొత్త జట్ల తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ, వారిని విడుదల చేసిన ఫ్రాంఛైజీలు తెగ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు...

యజ్వేంద్ర చాహాల్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ రిటెన్షన్ దక్కించుకోలేకపోయాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చాహాల్‌ని వేలానికి వదిలేసింది.
Chahal
మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్‌కి వెళ్లిన చాహాల్, అక్కడ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. సీజన్‌లో ఇప్పటికే 22 వికెట్లు తీసిన చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు... ఇప్పుడున్న ఫామ్‌లో చాహాల్, ఆర్‌సీబీలో ఉండి ఉంటే ఆ జట్టు మరింత పటిష్టమైన స్థానంలో ఉండి ఉండేది...
David Warner
డేవిడ్ వార్నర్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, వార్నర్‌ని ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తొలగించి, టీమ్ స్థానం లేకుండా చేసి... అన్ని విధాలుగా అవమానించింది... వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వెళ్లిన వార్నర్, 8 మ్యాచుల్లో 356 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కి ఓపెనింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వార్నర్ భాయ్ ఉండి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు...
హార్ధిక్ పాండ్యా: గత రెండు సీజన్లలో వెన్ను గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోయిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో చోటు దక్కలేదు. దీంతో డ్రాఫ్ట్ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కి వెళ్లి, కెప్టెన్‌గా నియమితుడైన హార్ధిక్ పాండ్యా... ఆల్‌రౌండ్ షోతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. పాండ్యా మిస్ చేసుకున్న ముంబై ఇండియన్స్, వరుసగా 8 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...
శిఖర్ ధావన్: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్‌గా గత మూడు సీజన్లలో 500+ పైగా పరుగులు చేస్తూ వచ్చాడు ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే ధావన్‌ని అట్టిపెట్టుకోని ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లిన శిఖర్ ధావన్, 11 మ్యాచుల్లో 381 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు...
కుల్దీప్ యాదవ్: డేవిడ్ వార్నర్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే సీజన్‌లో అవమానిస్తే, కుల్దీప్ యాదవ్... కేకేఆర్‌లో గత మూడు సీజన్లలోనూ ఇదే రకమైన అనుభవాన్ని చవిచూశాడు. రిజర్వు బెంచ్‌లో కూర్చొని కూల్‌డ్రింక్స్ ఇచ్చేందుకే పరిమితమైన కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతూ అదరగొడుతున్నాడు.
10 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. కుల్దీప్‌ని దూరం చేసుకున్న కేకేఆర్, మ్యాచ్ విన్నర్ లేక ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...
కగిసో రబాడా: గత సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన కగిసో రబాడా, 2020 సీజన్‌లో 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా గెలిచాడు. అయితే ఆన్రీచ్ నోకియాని రిటైన్ చేసుకున్న ఢిల్లీ, రబాడాని వేలానికి వదిలేసింది. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కి వెళ్లిన రబాడా 10 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు...
మహ్మద్ షమీ: గత సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మహ్మద్ షమీని మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టైటాన్స్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
సిమ్రాన్ హెట్మయర్: గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన సిమ్రాన్ హెట్మయర్, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులు చేసిన హెట్మయర్, రాయల్స్‌కి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు...
దినేశ్ కార్తీక్: గత సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడిన దినేశ్ కార్తీక్, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు. 11 మ్యాచుల్లో 244 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు...