- Home
- Sports
- Cricket
- బట్లర్‌ని చూసి మిగిలినవాళ్లు నేర్చుకోవాలి... పరోక్షంగా అశ్విన్‌ని ట్రోల్ చేసిన యువరాజ్ సింగ్...
బట్లర్‌ని చూసి మిగిలినవాళ్లు నేర్చుకోవాలి... పరోక్షంగా అశ్విన్‌ని ట్రోల్ చేసిన యువరాజ్ సింగ్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్, నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరిన అశ్విన్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి హాట్ టాపిక్ అయ్యాడు...

తాజాగా యువరాజ్ సింగ్, జోస్ బట్లర్‌ని పొడుగుతూ వేసిన ఓ ట్వీట్ కారణంగా మరోసారి సోషల్ మీడియాలో రవిచంద్రన్ అశ్విన్ గురించి ఓ మినీ యుద్ధమే జరుగుతోంది...
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్, హార్ధిక్ పాండ్యా కొట్టిన ఓ షాట్‌ని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. బౌండరీ టచ్ అయ్యిందీ, లేనిదీ తనకే క్లారిటీ రాకపోవడంతో అంపైర్‌తో థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయాల్సిందిగా సూచించాడు...
ఈ సంఘటనపై స్పందించిన యువరాజ్ సింగ్... ‘ఇప్పటికీ క్రికెట్‌లో కొందరు జెంటిల్మెన్ ఉన్నారు. జోస్ బట్లర్.. హ్యాట్సాఫ్. మిగిలిన ప్లేయర్లు అతని నుంచి నేర్చుకోవాలి. ముఖ్యంగా అతని టీమ్ మేట్స్...’ అంటూ ట్వీట్ చేశాడు...
జోస్ బట్లర్ టీమ్ మేట్స్ అనడంతో యువరాజ్ సింగ్ పరోక్షంగా రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తి గురించే వ్యంగ్యంగా కామెంట్ చేశాడని నెటిజన్లకు అర్థమైపోయింది...
2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రవి అశ్విన్, జోస్ బట్లర్‌ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడంపై అప్పట్లో పెను దుమారం రేగింది. అశ్విన్ చేసిన పని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ వాదించారు కొందరు క్రికెటర్లు.
దీంతో అశ్విన్ అంటే నీకు ఎందుకు ఇంత ద్వేషం? అంటూ యువరాజ్ సింగ్‌ని కామెంట్లతో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే అశ్విన్‌కి మద్ధతుగా నిలుస్తూ యువీని ట్రోల్ చేస్తున్నారు...
2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్, ఆ సమయంలో యువీని తుది జట్టు నుంచి తప్పించాడు. ఆ పాత పగ మనసులో పెట్టుకుని అశ్విన్‌ని యువీ ట్రోల్ చేస్తున్నాడని అంటున్నారు కొందరు నెటిజన్లు...
మరికొందరైతే 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో నువ్వు షాట్స్ ఆడలేకపోతున్నప్పుడు అశ్విన్‌లా రిటైన్ అవుట్ అయ్యి ఉంటే... భారత జట్టు టైటిల్ గెలిచేదని యువీకి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు...
భారత క్రికెటర్ క్రీడాస్ఫూర్తిని పరోక్షంగా విమర్శించడం వల్ల యువరాజ్ సింగ్ తనకున్న గౌరవాన్ని కోల్పోతున్నాడని, అశ్విన్ క్రీడా స్ఫూర్తి ఏంటో అతని రికార్డులు చూస్తేనే తెలుస్తుందని అంటున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్...