- Home
- Sports
- Cricket
- IPL2022: ప్చ్.. ఈసారి ఈ ఐదుగురు లెజెండ్స్ మెరుపులు మిస్ అవుతున్న ఐపీఎల్ ఫ్యాన్స్.. ఆ దిగ్గజాలెవరంటే..
IPL2022: ప్చ్.. ఈసారి ఈ ఐదుగురు లెజెండ్స్ మెరుపులు మిస్ అవుతున్న ఐపీఎల్ ఫ్యాన్స్.. ఆ దిగ్గజాలెవరంటే..
IPL 2022 Live Updates: ఐపీఎల్ ప్రారంభం నుంచి గతేడాది అక్టోబర్ లో ముగిసిన 14వ సీజన్ దాకా క్రికెట్ అభిమానులను అలరించిన ఐదుగురు ఆటగాళ్లు ఈసారి ఆడటం లేదు. తమదైన ఆటతీరుతో ఐపీఎల్ మీద తమదైన ముద్ర వేసిన వాళ్లెవరో ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్-15 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నది. నిరాటంకంగా 14 సీజన్ల పాటు కొనసాగుతున్న ఈ మెగా సీజన్ లో ప్రారంభ సీజన్ల నుంచి మెరుస్తూ వచ్చిన ఐదుగురు ఆటగాళ్లు ఈసారి మాత్రం ఆడటం లేదు. పలు కారణాల రీత్యా ఐపీఎల్ కు దూరంగా ఉన్న ఐదుగురు వెటరన్స్ గురించి ఇక్కడ చూద్దాం.
1. అమిత్ మిశ్రా : టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఈ లీగ్ లో ఆడుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2015 వరకు రెండు జట్లు మారినా.. ఆ సీజన్ నుంచి 2021 దాకా ఢిల్లీతోనే ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో 154 మ్యాచులాడి 166 వికెట్లు పడగొట్టాడు.
2. హర్భజన్ సింగ్ : టీమిండియా మాజీ స్పిన్నర్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కొద్దికాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. నాలుగు సార్లు ఐపీఎల్ విజేత గా నిలిచిన జట్టులో భజ్జీ సభ్యుడు.. 2013, 2015, 2017లలో ముంబై గెలిచిన ట్రోఫీలలో భజ్జీ మెంబర్ కాగా.. 2018లో సీఎస్కే తరఫున ఆడాడు.
మొత్తంగా ముంబై ఇండియన్స్, సీఎస్కే, కేకేఆర్ తరఫున ఆడిన భజ్జీ.. ఐపీఎల్ లో అత్యధిక బంతులు (1268) విసిరిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. మొత్తంగా 163 మ్యాచులాడి.. 160 ఇన్నింగ్స్ లలో 150 వికెట్లు తీశాడు.
3. సురేశ్ రైనా : ఎంఎస్ ధోని తర్వాత తమిళనాడులో చిన్న తాలా గా గుర్తింపుపొందిన రైనా ను ఈ సీజన్ లో ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. 2008 సీజన్ నుంచి 2021 దాకా నిరాటంకంగా ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన రైనా ఈ సీజన్ లో ఆడటం లేదు.
మొత్తంగా 205 మ్యాచులాడిన రైనా.. 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ 39 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ లో 506 ఫోర్లు, 203 సిక్సర్లు కొట్టిన రైనా.. చెన్నై గెలిచిన నాలుగు ఐపీఎల్ ట్రోఫీలలో సభ్యుడు.
4. ఎబి డివిలియర్స్ : మిస్టర్ 360 గా గుర్తింపు పొందిన డివిలియర్స్ 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. 2011 లో ఆర్సీబీలోకి వచ్చిన డివిలియర్స్.. ఆ జట్టు ఆటగాడు కోహ్లితో కలిసి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ దక్షిణాఫ్రికా వెటరన్ 170 ఇన్నింగ్స్ లలో 5,162 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో 3 మెరుపు సెంచరీలు చేయడమే గాక.. 40 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్ లో 413 ఫోర్లు, 251 సిక్సర్లు బాదాడు మిస్టర్ 360. గత సీజన్ అనంతరం మిస్టర్ ఎబిడి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
5. క్రిస్ గేల్ : ఐపీఎల్ పేరును సార్థకం చేసిన ఆటగాళ్లలో యూనివర్సల్ బాస్
ఒకడు. ధనాధన్ క్రీడలో దుమ్ము రేపే ప్రదర్శనలతో 14 సీజన్ల పాటు ఫ్రాంచైజీతో సంబంధం లేకుండా అభిమానులను అలరించాడు. తాను సాధించిన రికార్డులను తానే చెరిపేసుకున్న ఈ విండీస్ దిగ్గజం ఈసారి ఐపీఎల్ లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా ఐపీఎల్ నుంచి తప్పుకున్న గేల్ రికార్డుల రారాజు.. ఐపీఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు గేల్ మాత్రమే.
2012లో పూణె వారియర్స్ మీద 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అటువంటి మెరుపు ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడిన గేల్.. ఐపీఎల్ లో మూడు జట్లు మారాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఐపీఎల్ లో 142 మ్యాచులాడి 141 ఇన్నింగ్స్ లలో 4,965 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు 31 హాఫ్ సెంచరీలున్నాయి. తన వీర బాదుడులో.. 405 ఫోర్లు, 357 సిక్సర్లు కూడా సాధించాడు గేల్.