- Home
- Sports
- Cricket
- వాళ్లు కెప్టెన్లా? ఒంటి మీద డ్రెస్సులా? అలా మార్చుతారేంటి.. ఐపీఎల్ లో అత్యధిక సార్లు సారథిని మార్చిన జట్లివే..
వాళ్లు కెప్టెన్లా? ఒంటి మీద డ్రెస్సులా? అలా మార్చుతారేంటి.. ఐపీఎల్ లో అత్యధిక సార్లు సారథిని మార్చిన జట్లివే..
IPL 2022: ఒక జట్టు విజయవంతం అవ్వాలన్నా ఆ జట్టు నిలకడగా రాణించాలన్నా సారథి అనే వాడు సమర్థంగా ఉండాలి. జట్టులో ఎంతమంది స్టార్ ఆటగాళ్లున్నా.. వారిని సక్రమ మార్గంలో నడిపించనప్పుడు ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతీస్తాయి.

ఓ జట్టు కెప్టెన్లను మార్చడమే పనిగా పెట్టుకుంటే మరో జట్టేమో అసలు అదేదో మాకు సంబంధం లేని వ్యవహారంగా నిలకడగా రాణించింది. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సారథులను మార్చిన జట్టు ఏదో తెలుసుకుందాం.
1. పంజాబ్ కింగ్స్ : రాజకీయ నాయకులు పార్టీలు మారినంత ఈజీగా పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్లు మారతారు. ఇప్పటివరకు ఐపీఎల్ 14 సీజన్లు గడిచింది. శనివారం నుంచి ప్రారంభమయ్యేది 15వ సీజన్.. అయితే 14 సీజన్లలో పంజాబ్ కింగ్స్.. ఏకంగా 12 మంది కెప్టెన్లను మార్చింది.
యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, జయవర్ధనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, అశ్విన్, కెఎల్ రాహుల్ లు ఆ జట్టుకు సారథులుగా పని చేశారు. ఇటీవలే కెఎల్ రాహుల్ కూడా లక్నోతో చేరడంతో మయాంక్ అగర్వాల్ ను సారథిగా నియమించుకుంది పంజాబ్. ఆ జట్టుకు అతడు 13 వ సారథి.
2. ఢిల్లీ క్యాపిటల్స్ : పంజాబ్ మాదిరే ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు కూడా 12 మంది సారథులను మార్చింది. ఢిల్లీకి నాయకులుగా పనిచేసినవారి జాబితా.. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, దినేశ్ కార్తీక్, హోప్స్, జయవర్ధనే, రాస్ టేలర్, డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్, జేపీ డుమిని, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్ లు పనిచేశారు. అయ్యర్ కు గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయం కావడంతో రిషభ్ పంత్ ను సారథిగా నియమించుకుంది.
3. సన్ రైజర్స్ హైదరాబాద్ : ఐపీఎల్ లో రెండు ట్రోఫీలను గెలిచినా సరైన సారథి లేని కొరత హైదరాబాద్ ను కూడా వేదించింది. గడిచిన 14 సీజన్లలో హైదరాబాద్.. 8 మంది సారథులను మార్చింది. హైదరాబాద్ (ముందు డెక్కన్ ఛార్జర్స్) కు నాయకులుగా పనిచేసినవారిలో ఆడమ్ గిల్ క్రిస్ట్, కుమార సంగక్కర, డారెన్ సామి, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
మధ్యలో కొన్ని సీజన్లలో పలు మ్యాచులకు కామెరున్ వైట్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండేలు కూడా సారథులుగా ఉన్నారు. గత సీజన్ రెండో దశ నుంచి కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
4. ముంబై ఇండియన్స్ : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై కూడా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. ముంబైకి కెప్టెన్లుగా పనిచేసినవారిలో సచిన్ టెండూల్కర్, షాన్ పొలాక్, హర్భజన్ సింగ్, డ్వేన్ బ్రావో, రికీ పాంటింగ్, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మలు ఉన్నారు.
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఢిల్లీ, పంజాబ్ మాదిరిగానే ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్టు బెంగళూరు. తొలి సీజన్ లో రాహుల్ ద్రావిడ్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, కెవిన్ పీటర్సన్, డేనియల్ వెటోరి నాయకుడిగా పనిచేశారు. 2013 నుంచి 2021 దాకా విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్నాడు. మధ్యలో కొన్ని మ్యాచులకు షేన్ వాట్సన్ సారథిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు కోహ్లి తప్పుకోవడంతో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ గా వచ్చాడు. డుప్లెసిస్ బెంగళూరుకు ఆరో కెప్టెన్.
6. రాజస్థాన్ రాయల్స్ : ఐపీఎల్ తొలి ట్రోఫీ విజేత రాజస్థాన్ రాయల్స్ కు కూడా ఆరుగురు కెప్టెన్లు మారారు. తొలి సీజన్ కు షేన్ వార్న్ సారథిగా వ్యవహరించగా ఆ తర్వాత షేన్ వాట్సన్, రాహుల్ ద్రావిడ్, స్టీవ్ స్మిత్, అజింక్యా రహానే లు నాయకులుగా పని చేశారు. 2021 సీజన్ నుంచి శాంసన్ నాయకుడిగా ఉన్నాడు.
7. కోల్కతా నైట్ రైడర్స్ : ఐపీఎల్ లో రెండు సార్లు ట్రోఫీ విజేత కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఆరు సార్లు సారథులను మార్చింది. ఆ జట్టుకు తొలి రెండు సీజన్లకు సౌరవ్ గంగూలీ నాయకుడిగా ఉన్నాడు. తర్వాత బ్రెండన్ మెక్ కల్లమ్, గౌతం గంభీర్, జాక్వస్ కలిస్, కార్తీక్, ఇయాన్ మోర్గాన్ లు కెప్టెన్లు గా పనిచేశారు. ఈ సీజన్ నుంచి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
8. చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి 2022 మార్చి 24 వరకు ఈ లీగ్ లో కెప్టెన్ ను మార్చని ఒకే ఒక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇన్నాళ్లు ఆ జట్టును ధోని నే కెప్టెన్. ధోని లేని చెన్నై లేదు చెన్నై లేని ధోని లేడు అన్నంతగా మారిపోయింది పరిస్థితి. కానీ అనూహ్యంగా 2022 సీజన్ కు ముందు ధోని తప్పుకోవడంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజా కొత్త సారథిగా వచ్చాడు. కాగా 2009, 2010 సీజన్లలో ధోనికి గాయం కారణంగా పలు మ్యాచులను రైనా లీడ్ చేశాడు.