- Home
- Sports
- Cricket
- IPL2022: కాసుల పంట కురిపిస్తున్న ఐపీఎల్.. ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ తెలుసా..? అత్యధికంగా ఆ జట్టుదే..
IPL2022: కాసుల పంట కురిపిస్తున్న ఐపీఎల్.. ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ తెలుసా..? అత్యధికంగా ఆ జట్టుదే..
IPL 2022- Teams Brand Value: ఐపీఎల్ అంటేనే కాసుల పంట. భారత క్రికెట్ తో పాటు వివిధ ఫ్రాంచైజీలకు కామధేనువులా తయారైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని ఒక్కో జట్టు విలువ అమాంతం పెరిగింది. లక్నో, అహ్మదాబాద్ ల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు చేరిన తర్వాత ఐపీఎల్ విలువ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ప్రస్తుతం వివిధ దేశాలలో నిర్వహిస్తున్న టీ20లీగ్ లలో నెంబర్ వన్ గా ఐపీఎల్ నిలిచింది.

గతేడాది ఐపీఎల్ లో రెండు కొత్త జట్ల రాక కారణంగా బీసీసీఐకి ఊహించని ఆదాయం వచ్చింది. లక్నో, అహ్మదాబాద్ టీమ్ ల ద్వారా బీసీసీఐకి వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 12 వేల కోట్ల పై మాటే. మరి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఏ ఏ జట్టు బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..? ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
1. రాజస్థాన్ రాయల్స్ : ఐపీఎల్ లో అతి తక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టు రాజస్థానే.. ఐపీఎల్ తొలి ట్రోఫీ గెలవడం మినహా పెద్దగా సక్సెస్ కాని ఈ జట్టు బ్రాండ్ విలువ రూ. 249 కోట్లుగా ఉంది.
2. పంజాబ్ కింగ్స్ : పేరులో కింగ్స్ ఉన్నా ఈ జట్టు ఇంతవరకు ఐపీఎల్ లో సింహాసనం అధిష్టించింది లేదు. లీగ్ స్టేజ్ కే పరిమితమైన ఈ జట్టు విలువ రూ. 318 కోట్లు..
3. ఢిల్లీ క్యాపిటల్స్ : ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ ఒకటి. 2020 లో రన్నరప్ గా నిలిచినా పలుమార్లు ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ బ్రాండ్ వాల్యూ రూ. 370 కోట్లు..
4. సన్ రైజర్స్ హైదరాబాద్ : ఐపీఎల్ లో రెండు సార్లు ట్రోఫీ (2009లో డెక్కన్ ఛార్జర్స్, 2016లో సన్ రైజర్స్) బ్రాండ్ వాల్యూ రూ. 442 కోట్లుగా ఉంది.
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జట్టులో కింగులాంటి విరాట్ కోహ్లి తో పాటు స్టార్ ఆటగాళ్లు ఎందరున్నా బెంగళూరు కూడా ఇంతవరకు ట్రోఫీ నెగ్గలేదు. ఈ జట్టు బ్రాండ్ వాల్యూ రూ. 536 కోట్లని అంచనా..
6. కోల్కతా నైట్ రైడర్స్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అధినేతగా ఉన్న కేకేఆర్ బ్రాండ్ వాల్యూ రూ. 543 కోట్లు. ఈ ఫ్రాంచైజీ కూడా రెండు సార్లు ఐపీఎల్ విజేత.
7. చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ లో నాలుగు సార్లు విజేత, 9 సార్లు ఫైనలిస్టు అయిన సీఎస్కే బ్రాండ్ వాల్యూ రూ. 2,500 కోట్లు.. క్యాష్ రిచ్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైకి పేరుంది.
8. ముంబై ఇండియన్స్ : సీఎస్కే మాదిరిగానే ఈ లీగ్ లో విజయవంతమైన జట్టుగా ఉంది ముంబై. రోహిత్ సారథ్యంలోని ముంబై.. ఏకంగా ఐదు ట్రోపీలతో అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ అధినేతగా ఉన్న ఈ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ రూ. 2,700 కోట్లు.. లక్నో రాకముందు వరకు ఐపీఎల్ లో టాప్ బ్రాండ్ వాల్యూ ముంబైదే..
9. లక్నో సూపర్ జెయింట్స్ : గతేడాది ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి లక్నో.. గతేడాది వేలం ప్రక్రియలో సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఎల్ఎస్జీ.. రూ. 7,090 కోట్లతో ఫ్రాంచైజీని దక్కించుకుంది.
10. గుజరాత్ టైటాన్స్ : లక్నో మాదిరిగానే ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ కూడా రూ. 5.625 కోట్లతో ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.