- Home
- Sports
- Cricket
- Umran Malik: అతడిని చూస్తే గర్వంగా ఉంది.. అలాంటి బౌలర్ దొరకడం చాలా అరుదు.. : హైదరాబాద్ స్పీడ్ గన్ పై స్టెయిన్
Umran Malik: అతడిని చూస్తే గర్వంగా ఉంది.. అలాంటి బౌలర్ దొరకడం చాలా అరుదు.. : హైదరాబాద్ స్పీడ్ గన్ పై స్టెయిన్
TATA IPL 2022 - PBKS vs SRH: ఒక మ్యాచులో ఫాస్టెస్ట్ డెలివరీ ఒకటి వేయడమే గగనమంటే ఒక బౌలర్ మ్యాచ్ ఆసాంతం అదే పనిగా బుల్లెట్ వేగంతో బంతులు విసురుతుంటే..? చూసేవాళ్లకే కాదు వారి గురువుకు కూడా ఆనందమే కదా..

సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022 లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్ లో 6 మ్యాచులు ఆడిన అతడు 9 వికెట్లు తీసుకున్నాడు. అతడు ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు అతడికే దక్కుతున్నది.
వేగంలో తనకెవరూ సాటిరారంటూ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసరుతున్న ఈ జమ్మూ కుర్రాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ను మెప్పించాడు. తాజాగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఉమ్రాన్.. మరోసారి 150 కిలోమీటర్ల వేగంతో బాల్స్ విసిరాడు.
ఈ నేపథ్యంలో డేల్ స్టెయిన్ ఉమ్రాన్ బౌలింగ్ శైలిపై స్పందిస్తూ... ‘ఉమ్రాన్ నిలకడా 150 కిలోమీటరర్ల వేగంతో బంతులు విసురుతుండటం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇలాంటి బౌలర్లు దొరకడం చాలా అరుదు.
సాధారణంగా మా దగ్గరికొచ్చే యువ బౌలర్లకు ఇలా బౌలింగ్ చేయండి.. అలా పేస్ ను మార్చండి.. అని చెప్తాం. కానీ ఉమ్రాన్ అలా కాదు. అతడు సహజంగానే టాలెంట్ ఉన్న బౌలర్. అతడికి ఏం చెప్పాల్సిన పన్లేదు.
తన ఆటను తనకే వదిలేయాలి. నేను గానీ ఎస్ఆర్హెచ్ కోచ్ టామ్ మూడీగానీ చేస్తున్నది అదే. ఉమ్రాన్ పేస్ ను ఉపయోగించుకుని చాలా మంది బ్యాటర్లు పరుగులు సాధిస్తున్నారని ప్రధాన ఆరోపణ. అయితే మేము దానిని పట్టించుకోం. ఉమ్రాన్ బౌలింగ్ లో వైవిద్యం ఉంది. అతడు కేవలం వేగాన్నే నమ్ముకోలేదు.
ఇలాంటి బౌలర్లకు ఇలా చెయి.. అలా చెయి.. అని మన ఆలోచనలను వాళ్లపై రుద్దొద్దు. అది మంచిది కూడా కాదు. ఉమ్రాన్ తో కూడా మేం అదే విధానాన్ని అవలంభిస్తున్నాం. అందుకే అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఉమ్రాన్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు ఇబ్బందికరమేమో గానీ చూడటానికైతే మాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’ అని తెలిపాడు.
సమీప భవిష్యత్తులో ఉమ్రాన్ టీమిండియాలో కీలక బౌలర్ అవుతాడని స్టెయిన్ చెప్పడం విశేషం. ఇక ఇటీవల ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ.. తనకు ఇన్స్పిరేషన్ ఎవరు..? అని అభిమానులు ప్రశ్నించగా అతడు ఉమ్రాన్ పేరునే చెప్పడం విశేషం.