- Home
- Sports
- Cricket
- అప్పుడైనా ఇప్పుడైనా ఆ విషయంలో నా అభిప్రాయమిదే.. కోహ్లి తో గొడవపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
అప్పుడైనా ఇప్పుడైనా ఆ విషయంలో నా అభిప్రాయమిదే.. కోహ్లి తో గొడవపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
Gautam Gambhir Vs Virat Kohli: 2013లో ఐపీఎల్ సందర్భంగా అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లితో నాటి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ వాగ్వాదానికి దిగాడు.

2013లో ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లి, నాటి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మధ్య వాగ్వాదం రేగిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఒకరిమీద ఒకరు మాటలు తూలడమే గాక దాదాపు కొట్టుకునేంత స్థితికి వెళ్లారు.
ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇద్దరు ఆటగాళ్ల కెరీర్లో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు. ఐపీఎల్-2022 లో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘ఆరోజు కోహ్లి మీద వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అలా చేసినందుకు నేనెప్పుడూ బాధపడలేదు కూడా. క్రికెట్ లో ఆ మాత్రం పోటీ ఉండాల్సిందే. నాకు అటువంటి పోటీ అంటే ఇష్టం.
ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ధోనితో పోటీ ఒక విధంగా ఉంటే కోహ్లితో పోటీ మరో విధంగా ఉంటుంది. ఇక ఒక కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్న క్రమంలో మీరు దూకుడుగా ఉండాలని కోరుకుంటారు.
ఎందుకంటే మనం అనుకున్న పద్ధతిలో మన జట్టు ఆడాలని కోరుకుంటాం. ఈ క్రమంలోనే మా మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ మ్యాచులో కోహ్లిపై నేను ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ ఆ విషయంలో నేనేనాడూ దిగులు పడలేదు.
అదీ గాక కోహ్లి సాధించిన విజయాలపై నాకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అతడిని నేను కెరీర్ ఆరంభం నుంచి చూస్తున్నాను. కోహ్లి ఎలా ఆడతాడో నాకు తెలుసు. తన నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం గానీ, ఫిట్నెస్ విషయంలో గానీ కోహ్లి తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు..’ అని గంభీర్ తెలిపాడు.
ఈ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంతో కొన్నాళ్ల పాటు కోహ్లి-గంభీర్ మధ్య విబేధాలు తలెత్తాయని, ఇరువురి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అయితే తమ మధ్య విబేధాలు మీడియా సృష్టేనని, కోహ్లితో తనకు ఏనాడూ ఏ ఇబ్బందిలేదని గంభీర్ తెలిపాడు.
కోహ్లితో పాటే ధోనితో కూడా తనకు ఎలాంటి విబేధాలు లేవని గంభీర్ స్పష్టం చేశాడు. ‘నాకు, మాహీకి మధ్య గొడవలు ఉన్నాయనేది కేవలం పుకారు మాత్రమే. ఓ క్రికెటర్‌గా, మనసున్న మనిషిగా మాహీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది..’ అని అన్నాడు.
అతనికి ఏ అవసరం వచ్చినా నేను ముందుంటానని గంభీర్ చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్‌లో ఆడినప్పుడు ప్రత్యర్థుల్లా తలబడతాం, ఆ తర్వాత స్నేహితుల్లా కలిసి పోతాం.. టీమిండియా కోసం ధోని ఎన్నో త్యాగాలు చేశాడని గంభీర్ కొనియాడాడు.