- Home
- Sports
- Cricket
- మన టైమ్ వస్తుంది బ్రో.. బాధపడకు.. బౌండరీ వద్ద దిగాలుగా ఉన్న అర్జున్ చూసి అక్క ఎమోషనల్ పోస్ట్
మన టైమ్ వస్తుంది బ్రో.. బాధపడకు.. బౌండరీ వద్ద దిగాలుగా ఉన్న అర్జున్ చూసి అక్క ఎమోషనల్ పోస్ట్
Sara Tendulkar: ఐపీఎల్- 15 లో అట్టర్ ఫ్లాఫ్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో కూడా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ను పట్టించుకోలేదు. దీంతో అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు.

ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్స్ కు చేరలేదు. లీగ్ దశలో వరుసగా 8 మ్యాచులు ఓడి దారుణమైన అవమానం ఎదుర్కున్నది.
అయితే వరుసగా మ్యాచులు ఓడినా.. ప్లేఆఫ్ ఆశలు లేకపోయినా.. కొత్త ఆటగాళ్లను పరీక్షించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ను మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించలేదు.
ముంబై ఆడిన చివరి ఐదు మ్యాచులలో పలువురు కొత్త ఆటగాళ్లు టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆటగాళ్లను మార్చడం చేసినా అర్జున్ ను మాత్రం జట్టులోకి ఎంపికచేయకపోవడం పై ముంబై పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం మూడు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆ జట్టు ఆడిన చివరి లీగ్ మ్యాచ్ లో అయినా అర్జున్ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్ లో కూడా అతడికి మొండిచేయి చూపించింది యాజమాన్యం.
ఇక ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న అర్జున్ టెండూల్కర్ ను చూసి అతడి అక్క సారా టెండూల్కర్ ఎమోషనల్ అయింది.
అందుకు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ ఫోటోకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన గల్లీ బాయ్ సినిమాలోని ‘అప్నా టైమ్ ఆయేగా..’ పాటను జత చేసింది.
గతేడాది 20 లక్షలు పెట్టి అర్జున్ ను కొనుగోలు చేసిన ముంబై అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. ఈ ఏడాదైనా (రూ. 30 లక్షలు) అర్జున్ కు అవకాశమిస్తారని ముంబై, సచిన్ అభిమానులు ఆశించినా అతడికి మళ్లీ నిరాశే మిగిలింది.
సౌతాఫ్రికా యువ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, రమన్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చిన ముంబై.. అర్జున్ పేరును కనీసం పట్టించుకోకపోవడంపై సచిన్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. అతడిని కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా అవకాశమిచ్చినా బాగుండేదని వాపోతున్నారు.