- Home
- Sports
- Cricket
- నో బాల్ వివాదం ఎఫెక్ట్: పంత్, శార్దూల్ ఠాకూర్‌లకు భారీ జరిమానా, అతనిపై నిషేధం.. అప్పుడు మాహీ చేస్తే..
నో బాల్ వివాదం ఎఫెక్ట్: పంత్, శార్దూల్ ఠాకూర్‌లకు భారీ జరిమానా, అతనిపై నిషేధం.. అప్పుడు మాహీ చేస్తే..
ఎలాగో పోతుందని ముందే ఊహించిన మ్యాచ్. ఆఖర్లో ఓవర్‌లో ఒక్క బాల్ విషయంలో నానా రచ్చ చేసి, భారీ జరిమానా చెల్లించబోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్. అతనితో పాటు ఢిల్లీ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై కూడా చర్యలు తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం..

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 36 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌లో ఒక్క పరుగు చేయలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, 20వ ఓవర్‌లో నో బాల్ ఇవ్వలేదని నానా రాద్ధాంతం చేసింది...
ఆఖరి ఓవర్‌కి ముందే మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డగౌట్, వాలిపోయిన ముఖాలతో నిరాశగా కనిపించింది. అయితే ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 20వ ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది, ఢిల్లీ ముఖాల్లో మళ్లీ వెలుగులు నింపాడు రోవ్‌మెన్ పావెల్...
అయితే నాలుగో బంతి విషయంలో పెద్ద హై డ్రామానే నడిచింది. ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని నేరుగా నడుముపైకి షాట్ ఆడాడు రోవ్‌మెన్ పావెల్. ఆ షాట్‌కి పరుగులేమీ రాలేదు. ఫీల్డ్ అంపైర్లు ఆ బంతిని కరెక్ట్ బాల్‌గా పరిగణించడం... ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనుమానాలు వ్యక్తం చేసినా, థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్... ఆవేశంతో ఊగిపోయాడు...
దాన్ని నో బాల్‌గా ఎందుకు ఇవ్వరో కనుక్కోవాలంటూ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేని ఫీల్డ్ లోకి పంపిన రిషబ్ పంత్... అంపైర్లు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోవడంతో మ్యాచ్ ఆపేసి రావాలంటూ బ్యాటింగ్ చేస్తున్న రోవ్‌మెన్ పావెల్, కుల్దీప్ యాదవ్‌లకు సిగ్నల్ ఇచ్చాడు...
కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చేయమనడంతో క్రీజు వదిలి వెళ్లిపోవడానికి రెఢీ అయిపోయాడు కుల్దీప్ యాదవ్. దీంతో అక్కడే ఉన్న రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, అతన్ని అడ్డుకుని నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌కి వెళ్లాల్సిందిగా సూచించాడు...
ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో రిషబ్ పంత్ పక్కనే ఉన్న శార్దూల్ ఠాకూర్ కూడా అంపైర్లను హేళన చేస్తూ, ఆవేశంగా ఊగిపోయాడు. బ్యాటర్లను వచ్చేయాలంటూ సైగలు చేశాడు. దీంతో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం...
ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు, క్రమశిక్షణ రాహిత్యంగా నడుచుకున్నందుకు రిషబ్ పంత్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది... అంటే దాదాపు రూ.కోటి 17 లక్షల దాకా ఫైన్‌గా చెల్లించబోతున్నాడు పంత్.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ పనిని కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనను ఉల్లంఘించినట్టుగా పరిగణించిన రిఫరీ... అతనికి 50 శాతం మ్యాచ్ ఫీజ్ జరిమానా విధించాడు.
మ్యాచ్ నడుస్తున్న సమయంలో ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో తగువులాడిన అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా వేసిన రిఫరీ... ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించారు.
అయితే 2019 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలోనూ నో బాల్ విషయంలో ఇలాంటి హై డ్రామానే నడిచింది. అప్పటి సీఎస్‌కే సారథి ఎమ్మెస్ ధోనీ, క్రీజులోకి వెళ్లి అంపైర్లను వివరణ కోరాడు. అయితే అప్పుడు మాహీపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఐపీఎల్ యాజమాన్యం...