Suryakumar Yadav: 'సూర్య నమస్కారాల'కు కారణమిదే.. ఆ దండం వెనుక ఇంత కథుందా...?
TATA IPL 2022: ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఏదైనా అచ్చొచ్చిందా..? అంటే అది సూర్యకుమార్ యాదవే. ముంబై వరుసగా నాలుగు మ్యాచులు ఓడినా సూర్య మాత్రం అద్భుత బ్యాటింగ్ తో ఆ జట్టు పరువు నిలుపుతున్నాడు.

ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రెండ్రోజుల క్రితం ఫూణే వేదికగా ముగిసిన మ్యాచులో ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును మరోసారి ఆదుకున్నాడు. అయితే మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్.. తొలుత బాగానే ఆడినా తర్వాత తడబడింది. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబై.. 20 ఓవర్లు ముగిసేసరికి 151 పరగులు చేయగలిగింది.
ముంబై ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం సూర్యకుమార్ యాదవ్. ఈ మ్యాచులో 37 బంతులాడిన సూర్య.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు.
అయితే హాఫ్ సెంచరీ తర్వాత సూర్య.. రెండు చేతులు జోడించి పెవిలియన్ వైపునకు తిరిగి దండం పెట్టాడు. ఇది అతడి సెలబ్రేషన్ స్టైల్. మరి హాఫ్ సెంచరీ పూర్తి కాగానే సూర్య అలా దండం ఎందుకు పెడతాడు...?
ఈ ప్రశ్నకు ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో సమాధానం చెప్పింది. ముంబై-బెంగళూరు మ్యాచ్ జరిగిన పూణేలో తన కొడుకు ఆట చూడటానికి సూర్య తల్లిదండ్రులు అశోక్ కుమార్ యాదవ్, స్వప్న యాదవ్ లు విచ్చేశారట.
తల్లిదండ్రుల మధ్య మ్యాచ్ ఆడుతున్న సూర్య.. వారిని చూస్తూ రెండు చేతులు జోడించి దండం పెట్టాడట. సొంత అమ్మానాన్నల ముందు మ్యాచ్ ఆడుతూ రాణించడం కంటే గొప్ప విషయం ఏముంటుందని ముంబై ట్విట్ఱర్ లో రాసుకొచ్చింది.
ఇదిలాఉండగా.. బెంగళూరుతో మ్యాచుకు ముందు కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా సూర్య ఇలాగే చేశాడు. ఈ మ్యాచులో 52 రన్స్ చేశాడు. అప్పుడు కూడా సూర్య ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
అంతకుముందు భారత్ తరఫున వెస్టిండీస్ సిరీస్ లో రాణించినప్పుడు కూడా సూర్య.. హాఫ్ సెంచరీ కాగానే రెండు చేతులతో బ్యాట్ ను మధ్యలో పట్టుకుని దండం పెట్టాడు. దీనికి సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ.. సూర్య తన గురువు రోహిత్ శర్మ కు దండం పెట్టాడని పోస్టులు పెట్టారు.
మరి ఇందులో ఏది నిజమో గానీ.. మిగతా ఆటగాళ్ల మాదిరిగా ఏ హడావిడి, అరుపులు లేకుండా చక్కగా రెండు చేతులు జోడించి దండం పెట్టే సెలబ్రేషన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.