క్రిస్ గేల్ బ్యాటింగ్ చూసి ధోనీ భయపడిన క్షణం... మాహీ వికెట్ కీపర్ అయినందుకు...
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఏప్రిల్ 23తో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు బాదింది, అత్యల్ప స్కోరు నమోదు చేసింది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే. యాదృచ్ఛికంగా ఈ రెండూ కూడా ఏప్రిల్ 23నే రావడం విశేషం...

ఐపీఎల్ 2013 సీజన్‌లో పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోరు...
‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.
దిల్షాన్ 33, ఏబీ డివిల్లియర్స్ 8 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేయగా ఆర్‌సీబీ బ్యాటర్లలో ఎవ్వరూ 40+ స్కోరు కూడా చేయలేకపోయారు...
లక్ష్యఛేదనలో పూణే వారియర్స్ 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులకి పరిమితమైంది. స్టీవ్ స్మిత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌పై ట్విట్టర్ ద్వారా స్పందించాడు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...
‘జీవితం అనేది సరైన నిర్ణయాలు తీసుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు క్రిస్ గేల్ బ్యాటింగ్ చూసిన తర్వాత వికెట్ కీపర్‌గా ఉంటూ సరైన నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాహీ...
తాను వికెట్ కీపర్‌గా కాకుండా బౌలర్‌ని అయ్యి ఉంటే, క్రిస్ గేల్ విధ్వంసక బ్యాటింగ్‌కి బలి అయ్యేవాడినని మాహీ భయపడేలా సాగిన ఆ సునామీ ఇన్నింగ్స్‌కి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి...
ఆ తర్వాత 2017లో సరిగ్గా ఇదే రోజున ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆర్‌సీబీ...
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.3 ఓవర్లలో 131 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ టార్గెట్‌ని ఆర్‌సీబీ తేలిగ్గా ఛేదిస్తుందని అనుకున్నారంతా. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో కథ మాత్రం పూర్తిగా మారిపోయింది...
క్రిస్ వోక్స్, డే గ్రాండ్‌హోమ్, కౌంటర్ నైల్ స్పెల్స్ కారణంగా 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆర్‌సీబీ. 7 బంతుల్లో9 పరుగులు చేసిన కేదార్ జాదవ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీలో ఏ బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు.