IPL 2022: వరుసగా ఆరు ఓటములు.. ముంబై బౌలర్లకు ఆ జట్టు మాజీ సీమర్ కీలక సూచన
TATA IPL 2022: ఐపీఎల్ లో తిరుగులేని జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో అత్యంత చెత్త ఆటతో వరుసగా ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ లో ఆ జట్టు దారుణంగా విఫలమవుతున్నది.

ఐపీఎల్-2022 సీజన్ లో అసలు విజయమన్నదే లేకుండా వరుసగా ఆరు పరాజయాలతో దాదాపు ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ కంటే బౌలింగే అన్నది విమర్శకుల వాదన.
బ్యాటింగ్ లో ఎలాగోలాగో నెట్టుకొస్తున్న ఆ జట్టు.. బౌలింగ్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నది. ఈ సీజన్ లో ఒక్క బుమ్రా తప్ప ఆ జట్టులో మిగతా ఏ బౌలర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్, మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన జట్టులో సభ్యుడు మిచెల్ మెక్ క్లానన్.. ముంబై బౌలర్లకు కీలక సూచన చేశాడు.
క్లానన్ స్పందిస్తూ.. ‘ముంబైతో ఆడినందుకు నేనెంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ జాన్సన్ వంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఆ జట్టు సొంతం.
ఆ జట్టులో లెఫ్టార్మ్ పేసర్లు చాలా అదృష్టవంతులు. వాళ్లు చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ కోచింగ్ యూనిట్ (షేన్ బాండ్, జహీర్ ఖాన్) ఆ జట్టుకుంది. మీరు (ముంబై బౌలర్లు) చేయాల్సిందేమీ లేదు. వాళ్ల (ముంబై బౌలింగ్ కోచ్) లను నమ్మండి. వాళ్లు చెప్పింది చేయండి’అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ముంబై ఇండియన్స్ తరఫున 2015 నుంచి 2019 వరకు ఆడిన ఈ న్యూజిలాండ్ మాజీ పేసర్.. ఐపీఎల్ లో 56 మ్యాచులాడి 71 వికెట్లు పడగొట్టాడు.
ఇంకా క్లానన్ మాట్లాడుతూ.. ముంబై జట్టులో కీరన్ పొలార్డ్ కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని అన్నాడు. నెట్స్ లో పొలార్డ్ కు వేయడం కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ముంబై సారథి రోహిత్ శర్మకు తానెప్పుడూ బౌలింగ్ చేయలేదని తెలిపాడు.
కాగా ఈ సీజన్ లో ఆరు మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ నెల 21న ముంబై లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో కీలక మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఇందులో ఓడితే ముంబై ఇక ఇంటికే. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆ జట్టు.. తర్వాత ఆడబోయే 8 మ్యాచుల్లో గెలవాలి.