IPL2022: ఐపీఎల్ లో అత్యధిక శతకవీరులు వీళ్లే.. కోహ్లిని ఊరిస్తున్న అరుదైన రికార్డు
IPL 2022 Live Updates: క్రికెట్ కు వన్నె తెచ్చే సుదీర్ఘ టెస్టు ఫార్మాట్ లో గానీ, వన్డేలలో గానీ సెంచరీ చేయడం పెద్ద విషయమేమీ కాదు. బౌలర్లను అర్థం చేసుకుని ఆడుతూ పాడుతూ సెంచరీ బాదొచ్చు. కానీ టీ20లలో అలా కాదు. ధనాధన్ క్రికెట్ లో సెంచరీలంటే ఉత్తమాటలా..?

శనివారం నుంచి మహారాష్ట్ర వేదికగా ప్రారంభం కాబోతున్న పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లంతా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి శతకబాదేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ సీజన్ లో ఏ ఆటగాడు ముందుగా సెంచరీ చేస్తాడోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లెవరో ఒకసారి చూద్దాం.
1. క్రిస్ గేల్ : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. ప్రశాంతంగా క్రీజులోకి నడుచుకుంటూ వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ లు ఆడటంలో గేల్ దిట్ట. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు గేల్.. 142 మ్యాచులాడిన గేల్.. 6 సెంచరీలు చేశాడు. 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
2. విరాట్ కోహ్లి : భారత మాజీ సారథి విరాట్ కోహ్లి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 207 మ్యాచులాడిన కోహ్లి.. 5 శతకాలు చేశాడు. 42 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఐపీఎల్ లో 6,283 పరుగులు చేసిన కోహ్లి.. గేల్ రికార్డును అధిగమించేందుకు మరో రెండు సెంచరీలు చేయాలి. ఒక్కటి చేసినా గేల్ రికార్డును సమం చేస్తాడు.
3. డేవిడ్ వార్నర్ : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ సారథి వార్నర్ భాయ్ కూడా ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు. 150 మ్యాచులలో 5,449 పరుగులు సాధించాడు వార్నర్. ఐపీఎల్ లో నాలుగు సెంచరీలు బాదాడు. అంతేగాక 50 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ లో వార్నర్ ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు.
4. షేన్ వాట్సన్ : ఈ ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఐపీఎల్ లో 4 సెంచరీలు బాదాడు. 141 ఇన్నింగ్సులలో 3,874 పరుగులు చేసిన వాట్సన్.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.
5. ఎబి డివిలియర్స్ : గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడే సామర్థ్యముండి అభిమానులు మిస్టర్ 360 గా పిలుచుకునే దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఎబి డివిలియర్స్ ఐపీఎల్ లో 3 శతకాలు బాదాడు. ఆర్సీబీ తరఫున కోహ్లితో కలిసి ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిస్టర్ 360.. గత సీజన్ తర్వాత రిటైరయ్యాడు.
6. సంజూ శాంసన్ : ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శాంసన్ కూడా ఉన్నాడు. ఇండియా తరఫున ఆడుతూ పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. శాంసన్ ఐపీఎల్ లో మాత్రం ఇరగదీస్తాడు. శాంసన్ ఐపీఎల్ కెరీర్ లో 3 శతకాలున్నాయి. కోహ్లితో పాటు శాంసన్ కు కూడా గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.