- Home
- Sports
- Cricket
- మార్క్ వుడ్ స్థానంలో ఆ బంగ్లాదేశ్ పేసర్ ను కావాలనుకుంటున్న గౌతం గంభీర్.. ఓకే అంటే బంగ్లాకు షాకే..
మార్క్ వుడ్ స్థానంలో ఆ బంగ్లాదేశ్ పేసర్ ను కావాలనుకుంటున్న గౌతం గంభీర్.. ఓకే అంటే బంగ్లాకు షాకే..
IPL 2022 Live Updates: ఇటీవలే విండీస్ తో టెస్టు సిరీస్ లో గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో ఏ ఆటగాడిని తీసుకుంటారా..? అని లక్నో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు మెంటార్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఆ మేరకు జట్టును కూడా సిద్ధం చేసుకుంటున్నది. అయితే ఇటీవలే ఆ జట్టు వేలంలో దక్కించుకున్న ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
అయితే మార్క్ వుడ్ స్థానంలో ఇప్పటివరకు ఆ జట్టు ఎవరినీ భర్తీ చేయలేదు. కానీ తాజా నివేదికల ప్రకారం.. వుడ్ స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్ తో భర్తీ చేయాలని ఎల్ఎస్జీ భావిస్తుందట.
ఈ మేరకు ఎల్ఎస్జీ మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్.. ఈ ప్రతిపాదనను ఈ బంగ్లా పేసర్ కు ప్రతిపాదన పంపినట్టు ఆ దేశానికి చెందిన పలు మీడియాలలో కథనాలు వచ్చాయి.
కలేర్ కాంత్ అనే బంగ్లా వెబ్ సైట్ ప్రకారం.. ‘నాకు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ కావాలి. మొత్తం సీజన్ అతడు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అతడు ఈ ఆఫర్ కు అంగీకరిస్తే అతడు త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు దూరమవ్వాల్సి ఉంటుంది. ఆలోచించుకుని చెప్పమనండి..’ అని గంభీర్ చెప్పినట్టు పేర్కొంది.
ఇప్పటిదాకా 33 టీ20 లలో 23 వికెట్లు తీసిన టస్కిన్ అహ్మద్ గత కొన్ని రోజులుగా సరైన ఫామ్ లో లేడు. లైన్ అండ్ లెంగ్త్ లో గతి తప్పుతున్నాడని కూడా అతడిపై ఆరోపణలున్నాయి. అయినా కూడా గంభీర్ మాత్రం టస్కినే కావాలని కోరుకుంటున్నాడట.
ఒకవేళ టస్కిన్.. గంభీర్ ప్రతిపాదనను ఒప్పుకుంటే అది బంగ్లాదేశ్ కు ఝలక్ ఇచ్చినట్టే. దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ ఆడబోయే రెండు టెస్టుల సిరీస్ లో టస్కిన్ పేరు కూడా ఉంది.
టస్కిన్ ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు. ఒకవేళ గంభీర్ ఆఫర్ ను అతడు స్వీకరిస్తే దక్షిణాఫ్రికాతో టెస్టులకు ముందే.. అంటే వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఢిల్లీ విమానమెక్కాలి. మార్చి 23న వాండరర్స్ లో బంగ్లా.. సఫారీలతో మూడో వన్డే ఆడాల్సి ఉంది.
పది రోజుల క్రితం వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ మార్క్ వుడ్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తర్వాత అతడు తిరిగి గ్రౌండ్ కు రాలేదు. వేలం ప్రక్రియలో ఎల్ఎస్జీ.. వుడ్ ను రూ. 7.5 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక మార్చి 28న ఆ జట్టు ఐపీఎల్ లో మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తో వాంఖడే స్టేడియంలో తలపడబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరు జట్లు ఇప్పటికే సన్నాహాకాలు ప్రారంభించాయి.