IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. ఐపీఎల్ కు ఆ స్టార్ బౌలర్ అనుమానమే..?
Anrich Nortje Doubtful for IPL2022: మెగా సీజన్ కు కొద్దిరోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తాకనుంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆ జట్టు రూ. 6.5 కోట్లు పెట్టి వెచ్చించిన దక్షిణాఫ్రికా సీమర్..

ఐపీఎల్-2022 సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగలనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మెగా సీజన్ కు ముందు ఆ జట్టు కీలక ఆటగాడు, సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ ఆడేది అనుమానంగానే ఉంది.
గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ నార్జ్ ఇంకా కోలుకోలేదు. గతేడాది ముగిసిన ప్రపంచకప్ 2021తో పాటు ఇటీవలే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. ఆ సిరీస్ లో కూడా నార్జ్ ఆడలేదు.
ఐపీఎల్ 2021 సందర్భంగా అయిన గాయానికి సంబంధించి అతడింకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తున్నది. దీంతో ఢిల్లీ జట్టు.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని సంప్రదించింది. ఈ విషయంలో బీసీసీఐ.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఎ) తో మాట్లాడాలని కోరినట్టు తెలుస్తున్నది.
సౌతాఫ్రికా మెడికల్ టీమ్.. నార్జ్ హెల్త్ కు సంబంధించి వివరాలు అందజేయాల్సి ఉంది. ఐపీఎల్ లో పాల్గొనాలంటే నార్జ్ తప్పకుండా వారి నుంచి క్లీయరెన్స్ పొందాల్సి ఉంటుంది.
గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. కెప్టెన్ రిషభ్ పంత్ తో పాటు పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నార్జ్ లను రిటైన్ చేసుకుంది. నార్జ్ కోసం ఏకంగా రూ. 6.50 కోట్లు వెచ్చించింది. కాగా నార్జ్ గనక అందుబాటులో లేకుంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాకే.
ఇదిలాఉండగా.. నార్జ్ తో పాటు ఐపీఎల్ లో భాగమైన ఇతర దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సంబంధించి గురించి కూడా బీసీసీఐ.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును సంప్రదించనుంది. వాళ్లు మెగా సీజన్ కు అందుబాటులో ఉంటారా..? ఉండరా..? అనే విషయాలపై స్పష్టతను కోరింది.
anrich nortje
ఒకవైపు ఐపీఎల్ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుండగా.. దక్షిణాఫ్రికా మాత్రం ఆ సమయానికి బంగ్లాదేశ్ తో టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది. ఏప్రిల్ 12కు అది ముగుస్తుంది. ఇలా అయితే కనీసం మూడు వారాలైనా సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది.
కగిసొ రబాడా, మార్కో జాన్సేన్, ఎయిడిన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డసెన్, లుంగి ఎంగిడి, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు పలు ఐపీఎల్ జట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే క్వింటన్ డికాక్ మాత్రం టెస్టులలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడు అందుబాటులో ఉండే అవకాశముంది. మిగతావాళ్ల గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఈ విషయంలో దక్షిణాఫ్రికా బోర్డు కూడా ఆటగాళ్ల విధేయతకే నిర్ణయాన్ని వదిలేసింది. ఐపీఎల్, జాతీయ జట్టు.. ఈ రెండింటిలో ఏదో నిర్ణయించుకోవాలని ఆటగాళ్లకు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఆటగాళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దక్షిణాఫ్రికా తాజా నిర్ణయంతో అటు ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఎదురుదెబ్బే..