Harshal Patel: అనామకుడి నుంచి జట్టులో అత్యంత విలువైన ఆటగాడిగా.. ఆర్సీబీ బౌలింగ్ సంచలన హర్షల్ లైఫ్ హిస్టరీ ఇదే
IPL 2021: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత నిలకడగా బౌలింగ్ చేస్తున్న వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు హర్షల్ పటేల్. గుజరాత్ కు చెందిన ఈ ఆర్సీబీ బౌలర్.. ప్రస్తుత సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ వ్యక్తిగత జీవితం, అతడి కెరీర్ గురించి టూకీగా ఇక్కడ చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం దీని ముఖ్య ఉద్దేశం. ధనాధన్ బ్యాటింగ్.. కళ్లు చెదిరే క్యాచ్ లు.. ఔరా అనిపించే బౌలింగ్.. ఒక్కటేంటీ.. యూత్ కు కావాల్సిన మాస్ మసాలా మొత్తం ఐపీఎల్ లో దొరుకుతుంది. దీంతో పాటు భారత క్రికెట్ జట్టుకు ఈ ఈవెంట్ యువ టాలెంట్ ను అందిస్తున్నదన్నది నిస్సందేహంగా నిర్వివాదాంశం.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు వందలాది మంది ఉన్నారు. మారుమూల పల్లెటూర్ల నుంచి మెట్రో నగరాల దాకా అవకాశాలు రాక మగ్గిపోతున్న యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
దీని ద్వారా భారత క్రికెట్ లోకి వచ్చి స్థిరపడ్డ ఆటగాళ్లే నేటి భారత సీమర్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్.. ఇలా ఎంతో మంది. భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోకపోయినా ఆదిశగా అడుగులేస్తున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్.
గుజరాత్ లోని సనంద్ నగర్ లో 1990 అక్టోబర్ 23న జన్మించిన హర్షల్ పటేల్.. 2012లో ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు. హర్షల్ పటేల్ కు అమ్మనాన్న.. సోదరుడు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు అమెరికా వెళ్దామని అనుకున్నా కొడుకుల క్రికెట్ కెరీర్ గురించి ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.
2008 లో వినూ మన్కడ్ ట్రోఫీలో 23 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గుజరాత్ తరఫున హర్షల్ కు చోటు దక్కలేదు. దీంతో హర్యానా తరఫున ఆడి ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2011-12 రంజీ సీజన్ లో 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ కంట్లో పడ్డాడు.
ఐపీఎల్ లో చోటు దక్కినా అతడికి ఆడే అవకాశాలు రాలేదు. 2015 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున 17 వికెట్లు పడగొట్టినా తర్వాత సీజన్ లో ఆ జట్టు అతడిని వదిలించుకోవడం గమనార్హాం. దీంతో హర్షల్ ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగమయ్యాడు.
2017 నుంచి మళ్లీ ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ సీజన్ లో మొత్తం 26 వికెట్లు తీసిన హర్షల్.. గతంలో ఆర్సీబీ తరున అత్యధిక వికెట్లు తీసిన ఆర్. వినయ్ కుమార్ (26) సరసన నిలిచాడు. 2015లో చాహల్ 23 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రావో.. ఐపీఎల్ 1 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. బ్రావో రికార్డును చేరుకోవడానికి హర్షల్ కు ఇంకా ఆరు వికెట్లు తీస్తే చాలు.
గత రెండు మ్యాచ్ లలో పటేల్ ఆరు వికెట్లు తీశాడు. ముంబయి తో మ్యాచ్ లో హ్యాట్రిక్ పడగొట్టడం విశేషం. ప్లే ఆఫ్స్ కు ముందు ఆర్సీబీ మరో మూడు మ్యాచ్ లు ఆడనుండటంతో పటేల్ కు ఇదేం పెద్ద కష్టమేమీ కాదు.
అన్ క్యాప్డ్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చి అత్యంత విలువైన ఆటగాడిగా ఎదిగిన హర్షల్ పటేల్ కు ఇంకా పెళ్లి కాలేదు. కానీ అతడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన స్నేహితురాలికి సంబంధించిన ఫోటోలను పలుమార్లు షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్..’ అని అందులో రాసుకురావడం గమనార్హం.