- Home
- Sports
- Cricket
- రోహిత్, శార్దూల్ కాదు, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది... షేన్ వార్న్ కామెంట్...
రోహిత్, శార్దూల్ కాదు, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది... షేన్ వార్న్ కామెంట్...
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు సమిష్టిగా రాణించి, అద్భుత విజయం అందుకుంది. బ్యాటుతోనూ, బాల్‌తోనూ ప్రతీ ప్లేయర్ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చారు. అజింకా రహానే రెండు విభాగాల్లో విఫలమైనా, ఫీల్డర్‌గా ఆకట్టుకున్నాడు...

రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో భారత జట్టు భారీ స్కోరు చేయడానికి బాటలు వేసిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. విదేశాల్లో మొదటి టెస్టు సెంచరీ అందుకున్న మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు రోహిత్...
ఇంగ్లాండ్‌లో మూడు ఫార్మాట్లలోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఓవల్ టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న మొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు.
అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి, మూడు వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కాల్సిందని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు...
‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకుంటున్న సమయంలో కూడా రోహిత్ శర్మ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనకంటే శార్దూల్ ఠాకూర్‌కి ఈ అవార్డు దక్కడం కరెక్ట్ అంటూ కామెంట్ చేశాడు...
అయితే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ మాత్రం ఈ ఇద్దరికీ కాకుండా భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు...
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్‌లను ఒకే ఓవర్‌లో అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా... ఇంగ్లాండ్ జట్టును హై స్కోరు చేయకుండా నిలువరించగలిగాడు...
62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఓల్లీ పోప్, క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీలు... బెయిర్ స్టో, మొయిన్ ఆలీ ఇన్నింగ్స్‌ల కారణంగా 290 పరుగులు చేయగలిగింది...
తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండా రనౌట్ అయిన జస్ప్రిత్ బుమ్రా... రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటుతోనూ రాణించాడు. రిషబ్ పంత్ అవుటైన తర్వాత ఉమేశ్ యాదవ్, బుమ్రా కలిసి 9వ వికెట్‌కి 36 పరుగులు జోడించారు...
38 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత లోయర్ ఆర్డర్ చేసిన పరుగులు, ఇంగ్లాండ్‌పై నైతిక విజయం సాధించేలా చేశాయి...
రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించని సమయంలో అద్భుతమైన యార్కర్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ ఓల్లీ పోప్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...
ఆ తర్వాతి ఓవర్‌లోనే జానీ బెయిర్‌స్టోను కూడా డకౌట్ చేశాడు... బుమ్రా యార్కర్‌కి బెయిర్ స్టో క్లీన్‌బౌల్డ్ కాగా, జో రూట్‌ను కూడా యార్కర్లతో ఇబ్బంది పెట్టాడు...
‘బ్యాటింగ్ పిచ్‌పై పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు, పిచ్ ఏ మాత్రం సహకరించనప్పుడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన జస్ప్రిత్ బుమ్రా... నా దృష్టిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...