రికార్డులే రికార్డులు.. కోహ్లీ, రోహిత్ ల జోరు.. చరిత్ర సృష్టించిన టీమిండియా..
INDvsSL Live: భారత్ -శ్రీలంక మధ్య తిరువనంతపురంలో ముగిసిన మూడో వన్డేలో రోహిత్ సేన ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో పలు కీలక రికార్డులు బద్దలయ్యాయి.
స్వదేశంలో టీమిండియా మరో సిరీస్ ను ఒడిసిపట్టింది. శ్రీలంకపై ఇదివరకే టీ20 సిరీస్ నెగ్గిన ఊపులో ఉన్న భారత క్రికెట్ జట్టు.. తాజాగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తిరువనంతపురం వేదికగా ముగిసిన మూడో వన్డేలో నెగ్గడం ద్వారా భారత్ తో పాటు వ్యక్తిగతంగా కోహ్లీ, రోహిత్ లు కూడా పలు రికార్డులు తిరగరాశారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
కోహ్లీ కమాల్.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు వన్డేలలో సచిన్ సాధించిన ఘనతలను అందుకోవడానికి మరింత చేరువవుతున్నాడు. నేడు 87 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. వన్డేలలో 46వ శతకం బాదాడు. తద్వారా సచిన్ కంటే (49) మూడు సెంచరీల దూరంలో నిలిచాడు.
Image credit: KCA
ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్న మహేళ జయవర్దెనే రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ.. వన్డేలలో 267 మ్యాచ్ లు ఆడి 258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగులు సాధించాడు. కానీ నేటి మ్యాచ్ లో 166 పరుగులు చేయడంతో అతడు 12,659 పరుగులకు చేరాడు. తద్వారా జయవర్దెనే పేరిట ఉన్న 267 మ్యాచ్ లు ఆడి 258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగుల రికార్డు చెరిగిపోయింది. కోహ్లీ కంటే ముందు టెండూల్కర్, సంగక్కర, పాంటింగ్, జయసూర్య ఉన్నారు.
ఈ వన్డేలో సెంచరీతో స్వదేశంలో కోహ్లీ 21 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 20 సెంచరీలతో ఇన్నాళ్లు సచిన్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా ఇప్పుడు కోహ్లీ దానిని అధిగమించాడు. అంతేగాక ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు. లంకపై కోహ్లికి ఇది పదో వన్డే సెంచరీ. గతంలో సచిన్ 9 సెంచరీలు చేశాడు.
రోహిత్ శర్మ కూడా ధోని రికార్డును సమం చేశాడు. స్వదేశంలో వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ధోని పేరిట ఉన్న రికార్డుతో హిట్ మ్యాన్ సమానంగా నిలిచాడు. లంకతో మ్యాచ్ లో రోహిత్ మూడు సిక్సర్లు కొట్టాడు. తద్వారా స్వదేశంలో వన్డే ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్ల (123) ను ఈక్వల్ చేసినట్టైంది.
రోహిత్ తో పాటు కోహ్లీ కూడా ధోనికి లంక పై ఉన్న ఓ రికార్డును తుడిచేశాడు. లంకపై 67 మ్యాచ్ లు ఆడిన ధోని.. 53 ఇన్నింగ్స్ లలో 2,383 రన్స్ చేశాడు. తాజాగా కోహ్లీ దానిని అధిగమించాడు. కోహ్లీ.. 50 మ్యాచ్ లలో 2,387 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్.. 84 మ్యాచ్ లలో 3,113 రన్స్ చేశాడు.
ఇక వన్డేలలో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్ లో భారత్.. 317 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా భారత్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. గతంలో న్యూజిలాండ్.. ఐర్లాండ్ పై 290 పరుగుల తేడా (2008లో)తో గెలిచింది. ఇప్పుడు ఈ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.