హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. ఉప్పల్‌లో కివీస్ తో పోరులో ఘనత
INDvsNZ ODI: టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేలలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు.
హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట మరో రికార్డు లిఖించుకున్నాడు. వన్డేలలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ధోని పేరిట ఉండేది.
స్వదేశంలో వన్డే క్రికెట్ ఆడుతూ ధోని.. 123 సిక్సర్లు బాదాడు. మొన్న శ్రీలంకతో తిరువనంతపురం వన్డేలో రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్.. ధోని రికార్డును సమం చేశాడు. ఇక ఇప్పుడు కివీస్ తో తొలి వన్డేలో హిట్‌మ్యాన్.. షిప్లే వేసిన ఇండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సిక్సర్ బాదడం ద్వారా ధోని రికార్డు బద్దలైంది.
ఆ తర్వాత రోహిత్.. షిప్లేనే వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ బాదాడు. దీంతో స్వదేశంలో అతడి సిక్సర్ల (వన్డేలలో) సంఖ్య 125కు చేరింది. 75 ఇన్నింగ్స్ లలో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది.. 351 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత క్రిస్ గేల్.. 301 మ్యాచ్ లలో 331 సిక్సర్లు కొట్టాడు.
మూడో స్థానంలో లంక మాజీ సారథి సనత్ జయసూర్య.. 445 మ్యాచ్ లలో 270 సిక్సర్లు సాధించగా రోహిత్ శర్మ.. 238 వన్డేలలో 263 సిక్సర్లు బాదాడు. ధోనికి.. 350 వన్డేలలో 229 సిక్సర్లున్నాయి.