- Home
- Sports
- Cricket
- గిల్ జిగేల్.. రికార్డుల దుమ్ము దులిపిన టీమిండియా ఓపెనర్.. దెబ్బకు ఇషాన్, హిట్‌మ్యాన్ రికార్డులు మాయం
గిల్ జిగేల్.. రికార్డుల దుమ్ము దులిపిన టీమిండియా ఓపెనర్.. దెబ్బకు ఇషాన్, హిట్‌మ్యాన్ రికార్డులు మాయం
INDvsNZ Live Updates: ఉప్పల్ వన్డేలో 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. 87 బంతుల్లో సెంచరీ చేశాడు. 122 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేయగా 145 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.

ఏడాదికాలంగా వన్డేలలో నిలకడగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ తాజాగా హైదరాబాద్ వేదికగా కివీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు. తద్వారా పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. 87 బంతుల్లో సెంచరీ చేశాడు. 122 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేయగా 145 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.
ఈ క్రమంలో గిల్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్ లో అతి పిన్న వయసులో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. గతంలో ఇషాన్ కిషన్ తో పాటు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు.
శుభమన్ గిల్.. 23 ఏండ్ల 132 రోజులకు డబుల్ సెంచరీ చేశాడు. గత నెలలో ద్విశతకం బాదిన ఇషాన్ కిషన్ వయస్సు 24 ఏండ్ల 145 రోజులు. ఇక టీమిండియాకు సచిన్, సెహ్వాగ్ తర్వాత మూడో డబుల్ బాదిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించినప్పుడు అతడి వయసు 26 ఏండ్ల 186 రోజులు.
డబుల్ సెంచరీ ద్వారా గిల్.. ఉప్పల్ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో గిల్.. 208 పరుగులు చేయగా గతంలో సచిన్ టెండూల్కర్ (199లో 186 నాటౌట్), మాథ్యూ హెడెన్ (181 నాటౌట్ 2007లో) పేరిట ఉన్న రికార్డులు బద్దలయ్యాయి.
ఇక వన్డేలలో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ (19) లలో వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్ గా కూడా గిల్ రికార్డులకెక్కాడు. గతంలో ధావన్, కోహ్లీలకు ఈ ఫీట్ సాధించడానికి 24 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి. ఈ మ్యాచ్ కు ముందు 18 ఇన్నింగ్స్ లలో 894 పరుగులు చేసిన గిల్.. నేటి వన్డేలో 106 పరుగులు చేయడంతో వన్డేలలో అతడి వెయ్యి పరుగులు పూర్తయ్యాయి. ఆడిన 19వ ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు బాదిన రెండో భారత బ్యాటర్ గిల్. గిల్ కంటే ముందు ధావన్ పేరిట ఈ రికార్డు ఉంది.
హైదరాబాద్ వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఇందులో గిల్ చేసినవే 208 రన్స్ కావడం విశేషం. గిల్ తర్వాత రోహిత్ (34) టాప్ స్కోరర్.