INDvsENG 4th Test: దంచికొట్టిన ఇంగ్లాండ్... తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం...
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించగలిగింది ఇంగ్లాండ్ జట్టు... 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును, స్వల్ప స్కోరుకి నియంత్రించడంతో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు...

ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, ఓవర్టన్, డేవిడ్ మలాన్ వికెట్లు త్వరగా కోల్పోయింది. 62/5 స్కోరుతో కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను ఆరో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జానీ బెయిర్ స్టో, ఓల్లీ పోప్ కలిసి ఆదుకున్నారు.
77 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన బెయిర్ స్టోను అవుట్ చేసిన సిరాజ్, ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు... అయితే ఆ తర్వాత మొయిన్ ఆలీతో కలిసి ఏడో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఓల్లీ పోప్...
71 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసిన మొయిన్ ఆలీని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. అంతకుముందు జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో మొయిన్ ఆలీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినా, భారత జట్టులో ఎవ్వరూ సరిగ్గా అప్పీలు చేయకపోవడంతో అతను బతికిపోయాడు..
143 బంతుల్లో 6 ఫోర్లతో 74 పరుగులు చేసిన ఓల్లీ పోప్... భారత బౌలర్లను ఆటాడుకుంటూ పరుగులు సాధిస్తున్నాడు. ఓల్లీ పోప్‌కి గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం...
మొయిన్ ఆలీ అవుటైన తర్వాత క్రిస్ వోక్స్‌తో కలిసి 8వ వికెట్‌కి 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓల్లీ పోప్ 159 బంతుల్లో 6 ఫోర్లతో 81 పరుగులు చేసి... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...
ఆ తర్వాతి ఓవర్‌లో 5 పరుగులు చేసిన ఓల్లీ రాబిన్‌సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే క్రిస్ వోక్స్ దూకుడుగా ఆడుతూ ఆధిక్యాన్ని పెంచుతూ పోయాడు...
టీమిండియా ఇన్నింగ్స్‌లో చివరి మూడు వికెట్లు ఒకే పరుగు తేడాతో కోల్పోతే... ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌కి ఏకంగా 35 పరుగుల భాగస్వామ్యం రావడం విశేషం.
భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కి మూడు వికెట్లు దక్కగా, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు.
57 బంతుల్లో 11 ఫోర్లతో 50 పరుగులు చేసిన క్రిస్ వోక్స్... ఆఖరి వికెట్‌కి 40 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, హాఫ్ సెంచరీ తర్వాత రనౌట్ అయ్యాడు.