సరికొత్త చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్
Ravichandran Ashwin : లెజెండరీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ తర్వాత టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్ గా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సాధించాడు. ఇప్పుడు అతను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Rohit Sharma-R Ashwin
Ravichandran Ashwin : భారత జట్టు సెప్టెంబర్ 19 నుండి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. ఇందులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా చోటుదక్కింది.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సాధించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్ లో మరో చరిత్ర సృష్టించనున్నాడు. తన సరికొత్త రికార్డుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు ఈ స్టార్ స్పిన్నర్.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఐదేసి వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచే ఛాన్స్ అశ్విన్ కు ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయడంలో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఈ ఫీట్ చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.
ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్‌తో సమానంగా ఉన్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10-10 సార్లు ఐదేసి వికెట్లు తీసుకున్న ఘనత సాధించారు. ఇందులో నంబర్-1గా నిలవాలంటే అశ్విన్ ఇంకా ఒక్కసారి మాత్రమే 5 వికెట్లు తీయాలి.
కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో 174 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ అశ్విన్ నిలిచాడు. అలాగే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 150కి పైగా వికెట్లు తీసిన ఇతర ఇద్దరు బౌలర్లు నాథన్ లియాన్, పాట్ కమ్మిన్స్ లు ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ బౌలర్లు ఆస్ట్రేలియాకు చెందిన వారు కావడం గమనార్హం. అయితే, అశ్విన్ అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. కేవలం 58 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించి, ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు పూర్తి చేసిన బౌలర్‌గా నిలిచాడు.
అశ్విన్ కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు 174 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ డబుల్ సెంచరీ పూర్తి చేసేందుకు మరో 26 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ కు పంపాలి. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతను 200 వికెట్ల సంఖ్యను అందుకునే అవకాశం లేకపోలేదు.
అయితే, ఇది అంత సులువు కాదు. కానీ, అశ్విన్ ఇందుకోసం స్పిన్ మ్యాజిక్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 200 వికెట్ల మార్కును అందుకోలేకపోయారు. లియాన్ (187), కమిన్స్ (175) కూడా 200 వికెట్లు అందుకోలేకపోయారు.
R ashwin
బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో మ్యాజిక్ చేస్తే అశ్విన్ 200 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ వికెట్లు పూర్తి చేయడంతో పాటు దీనిని మొదటి భారతీయుడు కూడా అవుతాడు. ఎందుకంటే అతని తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడు జస్ప్రీత్ బుమ్రా, కానీ, చాలా వెనుకబడి ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బుమ్రా 110 వికెట్లు పడగొట్టాడు.
మొత్తంగా టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (36 సార్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (67 సార్లు), షేన్ వార్న్ (37 సార్లు), రిచర్డ్ హ్యాడ్లీ (36 సార్లు) ఉన్నారు. మొత్తంగా అశ్విన్ టెస్టు క్రికెట్ లో ఇప్పటివరకు 516 వికెట్లు తీసుకున్నాడు.