Indian Youngest Cricketer: 12 ఏళ్లకే రికార్డులు బద్దలు - వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రయాణం ఇది !
Vaibhav Suryavanshi: 2024 నవంబరులో 13 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ రాయల్స్‌తో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన తర్వాత ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా మాత్రమే కాకుండా, లీగ్ కంటే చిన్న వయసులో కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

Indian Youngest Cricketer: క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం... కేవలం 12 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. ఈ యువ సంచలనం ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైభవ్ సూర్యవంశీ బాల్యం- క్రికెట్ ప్రయాణం:
వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్‌పూర్ సమస్తిపూర్‌లో జన్మించాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక రైతు, పార్ట్‌టైమ్ జర్నలిస్ట్. ఏడేళ్ల వయస్సులో తండ్రివద్ద, స్కూల్ లో క్రికెట్ పాఠాలు మొదలుపెట్టాడు. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ పట్ల ఆసక్తిని గమనించి వైభవ్ తండ్రి వారికున్న స్థలంలో అతని కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు.
చిన్న వయస్సుల్లోనే అద్భుతంగా రాణిస్తూ ఎంతో నైపుణ్యం కలిగిన బ్యాట్స్ మెన్ గా రాటుతేలాడు. అతనికి ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి వైభవ్ అండర్-16 జిల్లా ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అక్కడ నంచి అతనికి తిరుగులేని ప్రయాణం సాగించాడు. అక్కడ అతను సెలక్ట్ అయ్యాడు. 10 సంవత్సరాల వయసులో సీనియర్ ఆటగాళ్లతో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మైదానంలో అద్భుతమైన ఆటతో పాటు గేమ్ పట్ల అతని అవిశ్రాంత అంకితభావం బీహార్ జట్టులో స్థానం సంపాదించిపెట్టింది.
వైభవ్ 12 ఏళ్ల వయసులో వినూ మన్కడ్ ట్రోఫీలో బీహార్ అండర్-19 జట్టుకు ఆడాడు. 2024 జనవరిలో బీహార్ రంజీ జట్టులో చేరాడు. దీంతో బీహార్ తరపున ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా, రంజీ ట్రోఫీ చరిత్రలో బీహార్ తరపున ఆడిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా ఘనత సాధించాడు.

12 ఏళ్ల 284 రోజుల వయస్సులో బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశారు. దీంతో, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లను అధిగమించి, రంజీ ట్రోఫీలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఇక 2024 అక్టోబరులో ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో, వైభవ్ 58 బంతుల్లో శతకం సాధించి సంచలనం రేపాడు. భారత అండర్-19 క్రికెట్‌లో వేగవంతమైన శతకంగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.
అదే ఏడాది అక్టోబర్‌లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌తో అండర్-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. అలాగే, వైభవ్ అండర్-19 ఆసియా కప్‌లో శ్రీలంకపై సెమీఫైనల్లో 67 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
అతని అద్భుతమైన ఆటతో ఐపీఎల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. 2025 ఐపీఎల్ వేలంలో వైభవ్ పేరు ₹30 లక్షల బేస్ ప్రైస్‌తో నమోదైంది. అయితే, అతని కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ కూడా నడిచింది. అయితే, చివరకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది.
2024 నవంబరులో 13 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ రాయల్స్‌తో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన తర్వాత వైభవ్ ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా మాత్రమే కాకుండా, లీగ్ కంటే చిన్న వయసులో కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పుడు రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ మార్గదర్శకులతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాడు.
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తి అవుతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, అతని ప్రయాణం యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చేలా ఉందని పేర్కొంటున్నారు.