మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: షఫాలి వర్మకు దక్కని చోటు.. భారత జట్టు ఇదే
India womens ODI World Cup 2025 squad: భారత మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 జట్టులో షఫాలి వర్మకు చోటు దక్కలేదు. గాయాల నుంచి కోలుకున్న రేణుకా సింగ్ తిరిగి జట్టులోకి వచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వన్డే వరల్డ్ కప్ 2025 కోసం 15మందితో భారత మహిళల జట్టు
భారత మహిళల క్రికెట్ సెలక్షన్ కమిటీ 2025లో స్వదేశంలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం 15మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్యంగా యంగ్ ఓపెనర్ షఫాలి వర్మకు చోటు దక్కలేదు. మరోవైపు గాయాల కారణంగా దీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న రేణుకా సింగ్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చారు.
KNOW
స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన సెలెక్షన్ కమిటీ
సెలెక్షన్ కమిటీ ప్లేయర్ల స్థిరమైన ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇచ్చింది. 2022 నుండి 2025 మధ్యలో భారత జట్టు 19మంది కొత్త ఆటగాళ్లకు అరంగేట్రం కల్పించింది. కానీ ఈసారి ముఖ్యమైన వరల్డ్ కప్ ముందు సెలెక్షన్ కమిటీ చైర్‌పర్సన్ నీతూ డేవిడ్ మాట్లాడుతూ.. “ఈ జట్టుతో మేము చాలా కాలంగా పని చేస్తున్నాం. ఇంగ్లాండ్‌తో కూడా ఈ జట్టుతోనే ఆడాం. అందుకే పెద్ద మార్పులు చేయకూడదనుకున్నాం” అని తెలిపారు.
షఫాలి వర్మకు ఎందుకు చోటు దక్కలేదు?
వన్డే జట్టులో గత సంవత్సరం నుంచే షఫాలి వర్మ స్థానం కోల్పోయారు. ప్రస్తుతం ఆమె భారత ఏ జట్టుతో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పటికీ, ప్రధాన జట్టులో ఎంపిక కాలేదు. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడిన తేజల్ హస్నాబిస్, శుచీ ఉపాధ్యాయ్, సయాలి సత్గరే వంటి యంగ్ ప్లేయర్లు కూడా ఈ వరల్డ్ కప్ జట్టులో లేరు.
జట్టులోకి తిరిగొచ్చిన రేణుకా సింగ్
కాలి గాయం కారణంగా శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌కి దూరమైన రేణుకా సింగ్ ఇప్పుడు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆమె రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు అమంజోత్ కౌర్ కూడా వరల్డ్ కప్ జట్టులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ రిహాబ్‌లో ఉన్నందున ఆస్ట్రేలియా సిరీస్ మిస్ అవనున్నారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “ఆమె కీలక ప్లేయర్. గాయంతో బాధపడుతుండటంతో ఆమెకు విశ్రాంతి ఇచ్చాం. వరల్డ్ కప్‌కి మాత్రం ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నాం” అని అన్నారు.
సీనియర్ స్టార్ ప్లేయర్లతో కూడిన భారత జట్టు
బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్ తిరిగి రావడం జట్టు మరింత బలంగా మారిందని నీతూ డేవిడ్ తెలిపారు. దీప్తి శర్మ, స్నేహా రాణా వంటి సీనియర్లు కూడా లైనప్‌లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు. యంగ్ ప్లేయర్ ప్రతికా రావల్ తన మొదటి ఐసీసీ ఈవెంట్‌లో ఆడనున్నారు.
"సెలెక్షన్ మీట్ వర్షం కారణంగా ఆలస్యమైనప్పటికీ త్వరగానే ముగిసిందనీ, ఇది మా కెరీర్‌లో అతి తక్కువ సమయం పట్టిన సెలెక్షన్ మీటింగ్. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం" అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హార్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా, దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, స్నేహా రాణా, అరుంధతి రెడ్డి, ఎన్ శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్
స్టాండ్‌బైస్: తేజల్ హస్నాబిస్, ప్రీమా రావత్, ప్రియా మిశ్రా, ఉమా చేత్రి, మిన్ను మణి, సయాలి సత్గరే

