మ్యాచ్‌లు గెలుస్తున్నారు గానీ లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి.. టీమిండియాపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు విజయాలతో సెమీస్ రేసులో ముందంజలో ఉంది టీమిండియా. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన భారత్.. తర్వాత మ్యాచ్ లో నెదర్లాండ్స్ నూ ఓడించింది.
15 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. వరుసగా రెండు విజయాలు సాధించింది. ఈనెల 24న పాకిస్తాన్ తో గెలిచిన భారత్.. గురువారం నెదర్లాండ్స్ తోనూ గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.
అయితే భారత్ రెండు వరుస విజయాలు సాధించినా లోపాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయంటున్నాడు 1983 వన్డే ప్రపంచకప్ హీరో కపిల్ దేవ్. బౌలింగ్ విభాగం మెరుగైనా బ్యాటింగ్ లో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయని తెలిపాడు.
ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల క్రితం భారత బౌలింగ్ లో ఇబ్బందులు ఎదుర్కుంది. కానీ ఇప్పుడు బౌలింగ్ విభాగం కాస్త మెరుగైంది. కానీ బ్యాటింగ్ లో లోపాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. చివరి పది ఓవర్లలో భారత్ ఇంకా మరిన్ని పరుగులు చేయాలి. ఆఖరి 10 ఓవర్లలో 100 కంటే ఎక్కువ రన్స్ చేయాలి.
ఆస్ట్రేలియాలో గ్రౌండ్స్ పెద్దగా ఉంటాయి. ఇది స్పిన్నర్లకు అనుకూలించే విషయం. షమీ రాకతో పేస్ విభాగం మెరుగైనా స్పిన్నర్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కచ్చితమైన ప్రణాళికలతో వచ్చి ఉండాలి.
ఇటువంటి మ్యాచ్ లలో నోబాల్స్, వైడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిని తగ్గించుకోవాలి. ప్రాక్టీస్ చేసేప్పుడే వాటిని నియంత్రించుకోవాలి. మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే బౌలింగ్ విభాగం చూడటానికే బాగానే కనిపిస్తున్నా లోపాలు అయితే ఉన్నాయి..’ అని చెప్పాడు.
బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు ఒకరిద్దరిమీద ఆధారపడటం సరికాదని.. సమిష్టిగా ఆడాలని సూచించాడు. ‘జట్టులోకి సూర్యకుమార్ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్నాడు. అతి తక్కువ వ్యవధిలోనే పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కానీ రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. అతడు చెలరేగాలి. కెఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఓవర్ల పాటు క్రీజులో ఉండగలిగితే భారత జట్టు ఎంతటి భారీ లక్ష్యాన్నైనా ఛేదించగలదు. గడిచిన రెండేండ్లలో ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ.. తిరిగి ఫామ్ లోకి రావడం జట్టుకు లాభిస్తున్నది..’ అని తెలిపాడు.