ఒక్క మ్యాచ్! వందల కోట్ల ఎమోషన్స్... రిజల్ట్ తేడా కొడితే పరిస్థితి ఏంటి? పోతే పోయిందని ఊరుకుంటారా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియానికి లక్ష మంది అభిమానులు తరలి వస్తుంటే, వందల కోట్ల మంది టీవీల్లో, మొబైల్ ఫోన్లలో ఈ మ్యాచ్ వీక్షించబోతున్నారు...
మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఇండియా- పాకిస్తాన్ జనాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ఇండో- పాక్ మ్యాచ్ అంటే పిచ్చిపట్టినట్టు ఆవేశంతో ఊగిపోయే అభిమానులు, ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు...
అయితే మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి వీర లెవెల్లో ప్రచారం చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. టీఆర్పీ రికార్డులు కొల్లగొట్టాలని, రియల్ టైమ్ వ్యూస్ లెక్కించలేక డీస్నీ ప్లస్ హాట్ స్టార్ సర్వర్ కూడా సతమతమవ్వాలని ఈ మ్యాచ్ మీద వేల కోట్ల ఆశలు పెట్టుకుంది స్టార్ నెట్‌వర్క్...
ఇందులో ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషన్సే మార్కెటింగ్ ఆయుధంగా వాడుతోంది. ఈ మార్కెటింగ్ స్ట్రాటెజీ బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్, హైప్ వచ్చేశాయి. అయితే ఈసారి పరిస్థితి మునుపటిలా లేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతుల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది..
రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ కావడం, కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయినా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకి మంచి స్కోరు అందించాడు. పాక్ ఓపెనర్ల బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు..
ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఒక్క వికెట్ పడితే భారత జట్టు మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆశగా ఎదురుచూశారు భారత క్రికెట్ ఫ్యాన్స్. టీమిండియా ఓడినా మ్యాచ్ ఎంజాయ్ చేశామనే సంతృప్తితో ఇంటికి చేరారు. మరి ఇప్పుడు పరిస్థితి అలాగే ఉందా...
ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో ఇరుదేశాల మధ్య సందిగ్ధత వాతావరణం నెలకొంది. అదీగాక గత 3 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న పాకిస్తాన్ ఆ విజయగర్వంతో విర్రవీగుతోంది. అదీకాక భారత జట్టులో బుమ్రా, జడేజా లేరు. అయినా పాక్‌ని చిత్తు చేసి, టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు...
భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరికి వందల సంఖ్యలో ఇండియా, పాకిస్తాన్ ఫ్యాన్స్ వచ్చి తమ దేశాలకు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేశారు. మరి లక్ష మందితో నిండిపోయే స్టేడియంలో ఈ సారి రిజల్ట్ తేడా కొడితే పరిస్థితి ఏంటి? అంత మంది అభిమానుల ఎమోషన్స్‌ని, ఆగ్రహాన్ని కంట్రోల్ చేయగలగడం సాధ్యమయ్యే పనేనా... అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్ట్రేలియా ఎన్ని ఏర్పాట్లు చేసినా.. అంతమందిని నిలువరించడం అయ్యేపనేనా..!
2007 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన తర్వాత భారత జట్టుపై, వారి కుటుంబాలపై దాడులు జరిగాయి. ఈసారి వరల్డ్ కప్ గెలవలేకపోయినా పర్లేదు కానీ పాక్ చేతుల్లో ఓడిపోతే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృత్తమయ్యే ప్రమాదం మాత్రం ఉందని సోషల్ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి...