ఆ టైమ్‌లో అంత కూల్‌గా... రవిచంద్రన్ అశ్విన్ సమయస్ఫూర్తికి క్రెడిట్ ఇవ్వాల్సిందే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నుంచి అభిమానులు ఏదైతే ఆశించారో అంతకుమించి వెయ్యి రెట్ల మజాని అందించింది దాయాదుల సమరం. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన మొదటి ఓవర్ నుంచి ఛేదనలో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్... ట్విస్టులు, మలుపులు, హై డ్రామాలతో పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించింది.
Arshdeep Singh
పెద్దగా అంచనాలు లేని అర్ష్‌దీప్ సింగ్, భువీ, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 159 పరుగులకి పరిమితమైంది. 160 పరుగులు లక్ష్యఛేదనలో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు, గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవానికి పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా క్రీజులో కుదురుకున్నా, నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండడంతో కావాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది...
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 6, 17వ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు కావాలి. దీంతో భారత జట్టుకి మరో ఓటమి తప్పదనుకున్నారంతా. షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 3 ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టాడు విరాట్ కోహ్లీ..
హారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే ఆఖరి రెండు బంతులను స్టేడియం అవతల పడేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికే హార్ధిక్ పాండ్యా అవుట్. రెండో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైయిక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడో బంతికి 2 పరుగులు వచ్చాయి.
నాలుగో బంతికి సిక్సర్ బాదాడు కోహ్లీ. అది నో బాల్‌గా ఇవ్వడంతో ఫ్రీ హిట్ ఇచ్చారు అంపైర్లు. ఆ తర్వాతి బంతి వైడ్. టీమిండియా విజయానికి 3 బంతుల్లో 5 పరుగులు కావాలి. ఫ్రీ హిట్ బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకింది. అయితే విరాట్ కోహ్లీ సమయస్ఫూర్తితో వ్యవహరించి 3 పరుగులు తీశాడు. ఫ్రీ హిట్‌కి వికెట్లకు తగిలినా అవుట్ ఉండదనే విషయం కోహ్లీ ఆ సమయంలో కూడా గుర్తుంచుకుని.. ఆ బంతిని వృథా చేయకుండా మహా తెలివిగా 3 పరుగులు తీశాడు.
Image credit: PTI
ఐదో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన దినేశ్ కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా విజయానికి ఆఖరి బంతికి ఇంకా 2 పరుగులు కావాలి. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్. అందరిలో ఒక్కటే ఉత్కంఠ. అశ్విన్ ఏం చేస్తాడు? అని... మహ్మద్ నవాజ్, కార్తీక్ విషయంలో చేసిందే అశ్విన్ విషయంలోనూ ప్రయోగించాడు...
ఆఖర్లో ప్రెషర్ ఉంటుందని వైడ్ బాల్ వేసినా ఆడడానికి ముందుకొచ్చి స్టంపౌట్ అవుతాడని అదే అస్త్రాన్ని సంధించాడు మహ్మద్ నవాజ్. అయితే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎంతో కూల్‌గా క్రీజు కూడా దాటలేదు. వైడ్ బాల్‌ని ఆడే ప్రయత్నం కూడా చేయలేదు... నరాలు తెగే ఉత్కంఠ... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకుల గోల... ప్రెషర్... అలాంటి సమయంలో అశ్విన్ ఎంతో కూల్‌గా ఆ బంతిని వదిలేయడమంటే చాలా పెద్ద విషయమే...
Image credit: Getty
ఎందుకంటే దినేశ్ కార్తీక్ కూడా నవాజ్ వేసిన బంతిని వదిలేసి ఉంటే అది వైడ్‌గా తేలేదే. కానీ ఎలాగైనా ఆడి పరుగెత్తాలని అనుకుని స్టంపౌట్ అయ్యాడు. అశ్విన్ మాత్రం అలా చేయకుండా కూల్‌గా వదిలేశాడు. దాంతో స్కోర్లు సమమైపోయాయి. మ్యాచ్ టై... ఆఖరి బంతికి మిడ్ ఆఫ్ మీదుగా ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు అశ్విన్...
53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్... ఫ్యాన్స్‌కి చాలా స్పెషల్‌గా మిగిలిపోయింది. అయితే ఆఖర్లో అశ్విన్ చూపించిన కూల్‌నెస్‌కి కూడా క్రెడిట్ దక్కాల్సిందే. చివరి బంతికి అశ్విన్ ఏ చిన్నపొరపాటు చేసినా విరాట్ కోహ్లీ చేసిందంతా వృథా అయిపోయేది...